ఔరా.. ఇదేం రాజకీయం..!
నాడు, నేడు భార్యాభర్తలే పోటీదారులు ● 11 చోట్ల ఒకరి స్థానంలో మరొకరు
హత్నూర (సంగారెడ్డి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చిత్ర విచిత్రమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. గతంలో సర్పంచ్‌గా పనిచేసే వారే మళ్లీ తమ కుటుంబ సభ్యులను బరిలోకి దింపుతున్నారు. భర్తలు నిలిచిన చోట భార్యలు.. భార్యలు నిలిచిన భర్తలు పోటీ చేస్తున్నారు. దీంతో ఔరా ఇదేమి రాజకీయం అంటూ స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో 38 పంచాయతీలు ఉండగా, నాలుగు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 34 పంచాయతీలో ఎన్నికలు జరగనున్నాయి. 11 గ్రామాల్లో సర్పంచ్ బరిలో గతంలో భార్య సర్పంచ్‌గా ఉన్నవారు నేడు భర్తలు పోటీ చేస్తున్నారు. భర్తలు సర్పంచ్‌గా ఉన్న పంచాయతీల్లో ప్రస్తుతం భార్యలు బరిలో నిలిచారు. గతంలో దౌల్తాబాద్ గ్రామ సర్పంచ్‌గా కొన్యాల వెంకటేశం పనిచేయగా, ప్రస్తుతం భార్య విజయలక్ష్మి బరిలో ఉన్నారు. ఇదే పంచాయతీలో ఎంపీపీగా పనిచేసిన వావిలాల నర్సింహులు.. ప్రస్తుతం తన భార్య సంగీత సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్నారు. నూతనంగా మధుర గ్రామం పంచాయతీగా ఏర్పడటంతో గతంలో గౌండ్ల మాధవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం భర్త నవీన్‌గౌడ్ సర్పంచ్ బరిలో ఉన్నారు. గోవిందరాజుపల్లిలో బండమీది సునీత సర్పంచ్‌గా పనిచేశారు. ప్రస్తుతం భర్త రాజు పోటీ చేస్తున్నారు. చిక్ మద్దూర్ సర్పంచ్‌గా శ్రీనివాస్‌రెడ్డి ఉండగా, ప్రస్తుతం భార్య ప్రవీణ బరిలో ఉన్నారు. ముచ్చర్లలో అనిత సర్పంచ్‌గా ఉండగా ప్రస్తుతం భర్త యాదగిరి పోటీ చేస్తున్నారు. నస్తీపూర్ సర్పంచ్‌గా వరిగుంతం రాములు పనిచేయగా, ప్రస్తుతం భార్య సువర్ణ సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేశారు. సాదుల్‌నగర్ సర్పంచ్‌గా నాడు మాలతి పనిచేయగా, ప్రస్తుతం భర్త భాస్కర్‌గౌడ్ బరిలో నిలిచారు. కొత్తగూడెంలో గతంలో లకావత్ మాధవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రెండోసారి మాధవి ఎన్నికల బరిలో నిలిచారు. కొన్యాల సర్పంచ్‌గా పనిచేసిన సుజాత ప్రస్తుతం తిరిగి రెండోసారి పోటీలో నిలబడ్డారు. కొడిపాక సర్పంచ్‌గా గతంలో పనిచేసిన గొల్ల మాధవి ప్రస్తుతం మళ్లీ బరిలో నిలిచారు. లింగాపూర్ సర్పంచ్‌గా తల్లి లక్ష్మీ గతంలో పనిచేయగా, ప్రస్తుతం తనయుడు మణిదీప్ ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఇలా మండలంలో ఒకే కుటుంబం నుంచి భార్యాభర్తలు లేదా కుటుంబ సభ్యులు బరిలో నిలబడి తమ భవిష్యత్‌ను ప్రజల ముందు ఉంచారు.
ఔరా.. ఇదేం రాజకీయం..!


