డీపీఓ సాయిబాబ సస్పెన్షన్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబను సస్పెండ్ చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్, రూరల్ ఎంప్లాయిమెంట్ డైరెక్టర్ జి.శ్రీజన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఎంతో కీలకమైన జిల్లా పంచాయతీ అధికారిపై సస్పెన్షన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. డీపీఓ తరచూ సెలవుపై వెళుతున్నారు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆగస్టులో తొమ్మిది రోజులు, అక్టోబర్‌లో 15 రోజులు, ఈ నెలలో మూడు రోజులు సెలవుపై వెళ్లారు. వీటికి తోడు ఆయనపై కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక కూడా ఆయన సెలవుపై వెళ్లడం పట్ల కలెక్టర్ ప్రావీణ్య తీవ్రంగా పరిగణించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికపై పంపినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను సస్పెండ్ చేశారు.
జెడ్పీ సీఈఓకు బాధ్యతలు
జిల్లా పంచాయతీ అధికారి (ఇన్‌చార్జి)గా జిల్లా పరిషత్ సీఈఓ జానకిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కలెక్టర్ శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జానకిరెడ్డి శనివారం పదవీబాధ్యతలు తీసుకోనున్నారు.
ఎన్నికల వేళ కీలక అధికారిపై వేటు
అధికార వర్గాల్లో చర్చనీయాంశం
ఇన్‌చార్జి డీపీఓగా జానకిరెడ్డి


