విచిత్ర పొత్తులతో విలేజ్ పాలిటిక్స్
ఎక్కడ చూసినా స్థానిక ఎన్నికల సందడి ఓట్లకు దూరంగా ఐదు గ్రామాల ప్రజలు
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. మిత్రులు ఉండరనేది చరిత్ర చెప్పిన సత్యం. ఢిల్లీలో శత్రువులు.. గల్లీలో మిత్రులు అన్నట్లు ఉంది పంచాయతీ ఎన్నికల్లో పొడిచిన పొత్తు. ఇందుకు కొత్తపల్లి వేదికగా మారింది. బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా.. కాంగ్రెస్, బీజేపీతో కలిసి అనైతిక పొత్తుకు తెర తీయడం చర్చనీయాంశంగా మారింది. గ్రామానికి రాజకీయంగా రాష్ట్రస్థాయి గుర్తింపు ఉంది. దివంగత మంత్రి కరణం రామచంద్రారావు మెతుకుసీమ రాజకీయాల్లో మూడు దశాబ్దాల పాటు ఎదురు లేని రాజకీయ ఏలికగా, కేబినేట్ మంత్రిగా కొనసాగారు. అలాంటి రాజకీయ ప్రాధాన్యత గ్రామంలో మొదటి విడత ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా పాపన్నపేట మాజీ ఎంపీపీ లింగన్న గారి ప్రేమలత, బీఆర్‌ఎస్ మద్దతుదారుగా కుమ్మరి పద్మ, బీజేపీ తరఫున ఆ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ భార్య అంజలి నామినేషన్ దాఖలు చేశారు. అయితే బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓటమే లక్యంగా, కాంగ్రెస్ నాయకులు బీజేపీతో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జరిగిన లోపాయికార ఒప్పందంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి బుధవారం తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. వీరు బీజేపీ మద్దతుదారు అంజలికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామం చూసి రాజకీయ నాయకులు ముక్కున వేలేసుకుంటున్నారు. –పాపన్నపేట(మెదక్)


