విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తి అరెస్టు
సిద్దిపేటఅర్బన్: రోడ్డుపై న్యూసెన్స్ చేయడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిద్దిపేట త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బరిగెల కల్యాణ్ అనే వ్యక్తి ఈ నెల 2న గుండారం గ్రామంలో తన బంధువుల ఇంటికి బర్త్‌డే వేడుకల కోసం వెళ్లాడు. తిరిగి సిద్దిపేటకు వచ్చే క్రమంలో శనిగరం స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సును ముందుకు వెళ్లనీయకుండా అడ్డుపడుతూ ఇబ్బంది పెట్టాడు. బస్సుకు అడ్డుగా బైక్‌ను నిలిపి డ్రైవర్‌ను దూషించాడు. దీంతో త్రీటౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేయగా మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. ఆర్టీసీ డ్రైవర్ కోట నర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి బైక్, డ్రైవింగ్ లైసెన్స్ సీజ్ చేసి రిమాండ్‌కు తరలించారు.


