ఆర్టీసీ డ్రైవర్ నిజాయితీ
బస్సులో మరిచిపోయిన బ్యాగు అప్పగింత
సిద్దిపేటకమాన్: ఆర్టీసీ డ్రైవర్ నిజాయితీ చాటారు. బస్సులో మరిచిపోయిన బ్యాగును డ్రైవర్ గుర్తించి డిపో మేనేజర్ ద్వారా ప్రయాణికురాలికి అప్పగించారు. వివరాలిలా ఉన్నా యి. హైదరాబాద్ బోయిగూడకు చెందిన ప్రయాణికురాలు చంద్రిక సిద్దిపేట డిపోకు చెందిన బస్సులో గురువారం జేబీఎస్ నుంచి సిద్దిపేటకు ప్రయాణించారు. సిద్దిపేటలో బస్సు దిగే క్రమంలో బ్యాగును మరిచిపోయారు. బ్యాగులో రూ. లక్షా 44 వేల విలువగల 12 గ్రాముల బంగారం, రూ.18 వేల విలువగల వెండి వస్తువలతో పాటు రూ.3వేల నగదు ఉన్నాయి. బస్సు డ్రైవర్ మహేందర్ బ్యాగును గుర్తించి డిపో మేనేజర్‌కు అందజేశాడు. బ్యాగు ఎవరిదని ఆరా తీస్తుండగా.. సదరు మహిళ బస్టాండ్‌కు చేరుకున్నారు. డీఎం వివరాలు తెలుసుకుని బ్యాగును పోగొట్టుకున్నది చంద్రికగా నిర్ధారించి అప్పగించారు. దీంతో ప్రయాణికురాలు ఆర్టీసీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. డ్రైవర్‌ను డిపో మేనేజర్ అభినందించారు.


