విలీన పంచాయతీల్లో స్తబ్ధత
ఎక్కడ చూసినా స్థానిక ఎన్నికల సందడి ఓట్లకు దూరంగా ఐదు గ్రామాల ప్రజలు
జహీరాబాద్ టౌన్: స్థానిక పట్టణానికి సమీపంలోని ఐదు గ్రామ పంచాయతీల్లో రాజకీయ స్తబ్ధ త నెలకొంది. ఎన్నికల నగరా మోగితే చాలు ఆయా గ్రామాల్లో ఎన్నికల సందడి కనిపించేది. సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసే అభ్యర్థులు మద్దతు కోసం ఇంటింటికీ తిరుగు తూ సందడి చేసే వారు. పేరుకే పంచాయతీలు అయినప్పటికీ వాటి పరిధిలోకి వచ్చే కాలనీలు పట్టణంలో కలిసిపోవడంతో నగరీకరణ చోటు చేసుకుంది. అయితే మున్సిపల్‌లో పలు గ్రామ పంచాయతీలను విలీనం చేయడంతో పంచా యతీ ఎన్నికలతో సంబంధం లేకుండా పోయింది. చుట్టూ పక్కల గ్రామాల్లో ఎన్నిక హడావిడి కనిపిస్తుండగా.. ఐదు పంచాయతీల్లో రాజకీయ స్తబ్ధత నెలకొంది.
విలీనం.. ఓట్లకు దూరం
జహీరాబాద్‌కి సమీపంలో పస్తాపూర్, రంజోల్, అల్లీ పూర్, చిన్నహైదరాబాద్, హోతి(కె) ఐదు పంచాయతీలు ఉన్నాయి. పస్తాపూర్‌లో 4,800 మంది ఓటర్లు, హోతి(కె) 2,600, అల్లీపూర్‌లో 5,302, రంజోల్‌లో 3,927, చిన్న హైదరాబాద్‌లో 4,672 మంది ఓటర్లు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు వచ్చాయంటే చాలు.. ఆయా గ్రామాల్లో హడావుడి కనిపించేది. 2017లో ఐదు పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయగా.. అప్పటి నుంచి ఆయా గ్రామ పంచాయతీల్లోని ప్రజలు ఓట్లకు దూరంగా ఉంటున్నా రు. మున్సిపాలిటీ విలీనం తర్వాత పురపాలక సంఘం ఎన్నికలు జరిగాయి. ఇదిలా ఉండగా, తమ పంచాయతీని మున్సిపల్‌లో విలీనం చేయరాదని హోతి(కె) ప్రజలు కోర్టులో కేసు వేశారు. దీంతో రాష్ట్రం అంతటా ఎన్నికలు జరగనుండగా.. జహీరాబాద్ మున్సిపల్ లో మాత్రం వాయిదా పడ్డాయి. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు వచ్చినా.. మున్సిపల్‌లో విలీనం అయినందున పంచాయ తీ ఎన్నికలు కూడా నిర్వహించడంలేదు. ఈ విధంగా ఐదు పంచాయతీ గ్రామాల ఓటర్లు సుమారు తొమ్మిదేళ్లుగా ఓట్లు వేయకుండా దూరంగా ఉన్నారు. దీంతో ఆయా గ్రామ పంచాయతీల్లో రాజకీయ విరామం కొట్టిచ్చినట్లు కనిపిస్తుంది.


