ఇక సంగ్రామమే..!
నేటి నుంచి నామినేషన్లు
● 36 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు ● 7 మండలాలలో ఎన్నికల నిర్వహణ ● ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం
సంగారెడ్డి జోన్: పంచాయతీ ఎన్నికల తొలి ఘట్టానికి వేళయింది. గురువారం ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ విడుదలతో పాటు నామినేషన్ స్వీకరణ ప్రక్రియ మొదలుకానుంది. ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 వరకు సర్పంచ్ వార్డు స్థానాలకు నామినేషన్ వేసే అవకాశం కల్పించారు. మూడు రోజులపాటు ఆయా గ్రామాలకు కేటాయించిన కేంద్రాలలో అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
136 గ్రామ పంచాయతీలకు ఎన్నిక నిర్వహణ
రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో మొదటి విడతలో భాగంగా ఏడు మండలాల పరిధిలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. 136 గ్రామపంచాయతీలు, 1246 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. నామినేషన్ వేసే అభ్యర్థి 21 సంవత్సరాలు నిండి అదే గ్రామం పంచాయతీలో ఓటరు అయి ఉండాలి. అలాగే.. ప్రతిపాదించే వ్యక్తి సైతం అదే ఓటరు జాబితాలో నమోదై ఉండాలి.
36 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు
మొదటి విడతలో భాగంగా ఏడు మండలాల్లో నిర్వహించే పంచాయతీ ఎన్నికల కొరకు 36 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో మండల కేంద్రాలలో ఉన్న వివిధ శాఖల కార్యాలయాలలో నామినేషన్లు స్వీకరించేవారు. ప్రస్తుతం మండలంలో క్లస్టర్లుగా విభజించి ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాలలోని మండల పరిషత్, రైతు వేదికలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలను గుర్తించారు. దీంతో దూర భారంతో పాటు సమయం ఆదా అవుతుంది. ఒకే ప్రదేశంలో అన్ని కేంద్రాలు ఉంటే అందరూ ఒకేసారి రావడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. సజావుగా సాగేందుకు స్థానికంగానే కేంద్రాలను ఏర్పాటు చేశారు.
నిర్దేశించిన డిపాజిట్ తప్పనిసరి
సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా నిర్దేశించిన డిపాజిట్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. సర్పంచ్‌క్ పోటీ చేసే అభ్యర్థి అన్ రిజర్వ్ అయితే రూ.2వేలు, రిజర్వ్ అయితే రూ.1000, వార్డుకు పోటీ చేసే అభ్యర్థి రూ.500, రిజర్వ్ అయితే రూ.250 నిర్ణయించారు. పోటీ చేసే అభ్యర్థులు ఇంటి పన్ను చెల్లించి నో డ్యూస్ సర్టిఫికెట్ పొందాలి.
7 మండలాల్లో ఓటర్ల వివరాలు
మండలం పంచాయతీలు వార్డులు పురుషులు మహిళలు ఇతరులు
హత్నూర 38 334 20841 22051 2
గుమ్మడిదల 8 66 4318 4716 2
పటాన్‌చెరు 3 36 6487 6511 0
కంది 22 212 18616 19181 2
కొండాపూర్ 24 222 17545 18325 1
సదాశివపేట 30 272 19933 21083 0
సంగారెడ్డి 11 104 9273 9757 1


