ఎన్నికలకు పైసలెట్ల..?
‘పంచాయతీ’పై ‘రియల్’ ప్రభావం
గజ్వేల్: రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలడం పంచాయతీ ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. భూములు, ప్లాట్ల క్రయవిక్రయాలు జరిగితే ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉండేవి. కొంతకాలం నుంచి పరిస్థితి భిన్నంగా మారింది. ఈక్రమంలోనే ఆశావహుల ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన డబ్బులు కోసం వెంపర్లాడుతున్నారు. ఆశావహులందరూ ఎన్నికల బరిపై దృష్టి పెట్టారు. ఎన్నికల్లో ఖర్చు కీలకం. కనుక ఏమీ చేయాలనే అంశంపై తర్జనభర్జనలు పడుతున్నారు. ఎవరూ ఎక్కువ ఖర్చు పెడితే..వారు గ్రామాల్లో పట్టునిలుపుకుంటారనే పరిస్థితి రావడంతో ఇది పోటీదారులకు ఛాలెంజ్‌గా మారింది.
జోరుగా నడిచిన కాలంలో..
‘రియల్’ వ్యాపారం జోరుగా నడిచిన కాలంలో ప్రధాన రహదారుల వెంబడి ఉండే గ్రామాల్లో ఒకటి, రెండు గుంటలు అమ్ముకుంటే చాలు.. ఎన్నికల ఖర్చు సమకూరుతుందనే ధీమాలో ఉండేవారు. కానీ ఆ పరిస్థితి ముచ్చుకై నా కనిపించడం లేదు. ఒక వేళ కొనుగోలు చేస్తామని ఎవరైనా వచ్చినా...అత్తెసరు ధరకు కొంటామని తెగేసి చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరైతే ఎలాగైనా సర్పంచ్‌గా ఎన్నికై గ్రామంలో పట్టు సాధించాలనే సంకల్పంతో.. వాస్తవ ధరకు 50శాతం తగ్గినా అమ్మడానికి వెనుకాడటం లేదు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో సర్పంచ్ ఎన్నికకు సిద్ధమైన ఓ పార్టీ నాయకుడు ఇప్పటికే తక్కువ ధరకు భూమిని అమ్ముకొని డబ్బులు సిద్ధం చేసుకున్నాడు. గ్రామంలో సన్నిహితులు, స్నేహితుల ఎంత వారించినా వినకుండా ముందుకుసాగుతున్నారు.
తాకట్టు రుణాల వైపు పరుగు
డబ్బులను ఇన్‌స్టంట్‌గా పొందడానికి సర్పంచ్ పోటీదారులు వేరే దారిలేక... తాకట్టు రుణాలవైపు పరుగు తీస్తున్నారు. బంగారం మొదలుకొని ఇళ్లు, పొలాలు, ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లతో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. దీనివల్ల బ్యాంకుల్లో రద్దీ పెరిగింది. గజ్వేల్ పట్టణంలోని ఓ బ్యాంకులో రోజువారీగా 5 గోల్డ్ లోన్‌లు చేయడమే గగనంగా ఉండేది. నేడు సీను మారిపోయింది. సర్పంచ్ ఔత్సాహికుల వల్ల నిత్యం 20కిపైగా గోల్డ్ లోన్‌లు తీసుకుంటున్నారు. బంగారం లేని వ్యక్తులు ఇళ్లు, పొలాలు, ప్లాట్లు వడ్డీ వ్యాపారులకు అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రెండ్రోజులుగా ఈ వ్యవహారం ఉమ్మడి మెదక్ జిల్లాలోని గ్రామాల్లో కనిపిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది.
భూములు, ప్లాట్ల ధరలు పడిపోవడంతో
ఆశావహుల్లో నిరాశ
అమ్మకాల్లేక నిలిచిపోయిన
ఆర్థిక లావాదేవీలు


