నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలి
● నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి ● సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడుచుక్కా రాములు డిమాండ్
సంగారెడ్డి ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్లచట్టాలను రద్దు వెనక్కు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు డిమాండ్ చేశారు. బుధవారం రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్ నుంచి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను వేగవంతం చేస్తుందని మండిపడ్డారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే దేశ స్వాతంత్రాన్ని, ఆర్థిక స్వావలంబనను తాకట్టు పెడుతుందన్నారు. అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్‌గా మార్చిందన్నారు. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే ఈ పని చేసిందన్నారు. ఈ కోడ్‌ల వల్ల కార్మికులకు అనేక సౌకర్యాలను కాలరాస్తుందని విమర్శించారు. వ్యవసాయ కార్మికులకు ఉపయోగపడే ఉపాధి హామీ చట్టానికి సైతం కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని విమర్శించారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా నాయకులు ప్రసాద్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు జయరాజ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నర్సింలు, సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మల్లేష్, సాయి ఐఎన్‌టీయూసీ నాయకులు రాజేందర్ రెడ్డి, రైతు సంఘం నాయకులు రాజయ్య ప్రజాసంఘాల నాయకులు మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.


