ఎట్టకేలకు కీలక పోస్టుల భర్తీ
ఎస్‌ఈ, డీఈల పోస్టుల్లో రెగ్యులర్ అధికారుల నియామకం ఇద్దరు ఏడీఈలకు ఇతర జిల్లాలకు స్థానచలనం విద్యుత్‌శాఖలో పదోన్నతులు, బదిలీలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: విద్యుత్‌శాఖలో కొంత కాలంగా ఖాళీగా ఉన్న కీలక ఉన్నతాధికారుల పోస్టులు ఎట్టకేలకు భర్తీ అయ్యాయి. ఈ పోస్టుల్లో రెగ్యులర్ అధికారులను నియమిస్తూ ఎస్పీడీసీఎల్ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ పర్యవేక్షక ఇంజనీర్‌గా పనిచేసిన శ్రీనాథ్ రెండు నెలల క్రితం పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి పోస్టు ఖాళీగా ఉంటోంది. ఇన్‌చార్జిగా మేడ్చల్ చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కామేశ్‌కు బాధ్యతలు అప్పగించారు. మేడ్చల్ జిల్లాలో పనిచేసే అధికారి ఇక్కడ పూర్తి స్థాయిలో పనులను పర్యవేక్షించడంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎట్టకేలకు ఈ పోస్టులో సుధీర్‌కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. యాదాద్రిభువనగిరి జిల్లాలో పనిచేస్తున్న సుధీర్‌కుమార్ ఇక్కడికి పదోన్నతిపై వచ్చారు. బుధవారం ఆయన బాధ్యతలు తీసుకున్నారు.
డీఈగా నెహ్రూనాయక్
సంగారెడ్డి డీఈగా నెహ్రూనాయక్ నియమితులయ్యారు. ఇక్కడ డీఈగా పనిచేసిన సురేందర్‌రెడ్డి ఈ ఏడాది మేలో పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి ఈ పోస్టులో ఇన్‌చార్జి అధికారే కొనసాగుతున్నారు. ఎట్టకేలకు దాదాపు ఆరునెలల తర్వాత ఈ పోస్టులో రెగ్యులర్ అధికారిని నియమించారు. సైఫాబాద్‌లో పనిచేస్తున్న నెహ్రూనాయక్ కూడా పదోన్నతిపై సంగారెడ్డి డీఈగా వచ్చారు. ఆయన కూడా బుధవారం విధుల్లో చేరారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న పలువురు ఇంజనీరింగ్ ఉన్నతాధికారులకు పదోన్నతులు వచ్చాయి. ఇలా పదోన్నతులు పొందిన వారిని ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించింది.
మరో ఇద్దరు ఏడీఈలకు
పదోన్నతులు, బదిలీలు
జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు ఏడీఈలకు పదోన్నతులు లభించాయి. కన్‌స్ట్రక్షన్ విభాగంలో ఏడీఈగా పనిచేస్తున్న రామేశ్వర స్వామికి డీఈగా పదోన్నతి వచ్చింది. ఆయన్ను మెదక్ జిల్లా ఆపరేషన్ విభాగం డీఈగా బదిలీ చేసింది. అలాగే హెచ్‌టీ విభాగంలో పనిచేస్తున్న మరో ఏడీఈ వేణుకు కూడా ప్రమోషన్ వచ్చింది. హైదరాబాద్ సౌత్ డివిజన్ డీఈగా ఆయన్ను బదిలీ చేశారు. చాలా రోజులుగా ఖాళీగా ఉంటున్న ఈ పోస్టుల్లో రెగ్యులర్ అధికారిని నియమించారు.


