సమయపాలన పాటించాలి
● కలెక్టర్ ప్రావీణ్య● పకడ్బందీగా ఎన్నికలనియమావళి అమలు ● ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశం
సంగారెడ్డి జోన్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి విధి నిర్వహణలో అధికారులు తప్ప నిసరిగా సమయపాలన పాటించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తో పాటు ఎస్పీ పరితోష్ పంకజ్, అధికారులు హాజరయ్యారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ గురువారం ఉదయం 10 గంటల వరకు విడుదల చేయాలని సూచించారు. నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు పంచాయతీ పరిధిలోని ఓటరు జాబితా వివరాలను ప్రచురించాలన్నారు. 7 మండలాల్లోని 136 గ్రామ పంచాయతీలకు మొదటి దశ నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రతీ గ్రామ పంచాయతీకి సంబంధించిన రిజర్వేషన్లు, పోలింగ్ కేంద్రాల జియో లోకేషన్ వివరాలు, ఇతర డేటాలను వెంటనే టీపోల్ వెబ్‌సైట్, యాప్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందనరావు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జెడ్పీ సీఈఓ జానకీరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.
ముమ్మర తనిఖీలు చేయండి
సంగారెడ్డి జోన్: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తామని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. బుధవారం తన కార్యాలయం నుంచి జిల్లాలోని పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికలను ప్రభావితం చేసే వస్తువులు అక్రమ రవాణా జరగకుండా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఎస్‌హెచ్‌ఓలు తమ పరిధిలో గల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి, సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను సమీక్షించాలని సూచించారు. నామినేషన్ కేంద్రం వద్ద వంద మీటర్ల దూరంలో మార్కు చేయించాలని, వీడియో రికార్డింగ్ చేయించాలని పేర్కొన్నారు. ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావ్, డీఎస్పీ సత్యయ్యగౌడ్, ఏఆర్ డీఎస్పీ నరేందర్ పాల్గొన్నారు.


