యంత్రం.. తూతూమంత్రం!
సబ్సిడీ తక్కువ ఉందని పెదవి విరుస్తున్న రైతులు నామమాత్రంగానే దరఖాస్తులు ఎనిమిదేళ్ల తర్వాత ఈసారి పూర్తి స్థాయిలో అమలుకు చర్యలు వ్యవసాయ యాంత్రీకరణ పథకం తీరిది
యంత్ర పరికరాలకు అంతంతే స్పందన
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి అన్నదాతల నుంచి ఆశించిన మేరకు స్పందన కనిిపించడం లేదు. సబ్సిడీపై అందజేస్తున్న వ్యవసాయ యంత్ర పరికరాలను తీసుకునేందుకు రైతులు అంతగా ముందుకు రావడం లేదు. ఈ పరికరాలపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ తక్కువగా ఉందనే కారణంతో ఈ యంత్ర పరికరాల కోసం రైతులు దరఖాస్తులు చేసుకోవడం లేదు. రైతులు సాంప్రదాయ సాగు పద్ధతులకు స్వస్తి చెప్పి, యంత్రపరికరాలతో పంటలు సాగు చేసేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మహిళ, చిన్న, సన్నకారు రైతులకు 50 శాతం సబ్సిడీపై, సాధారణ రైతులకు 40 శాతం సబ్సిడీపై యంత్ర పరికరాలు అందజేస్తారు. స్ప్రేయర్‌లు, రోటోవేటర్లు, బండ్ బెల్లర్లు, సీడ్–ఫర్టి డ్రిల్లర్లు, ఇలా వివిధ రకాల యంత్ర పరికరాలు సబ్సిడీపై ఇస్తున్నారు. సబ్సిడీ పోగా మిగిలిన మొత్తాన్ని రైతులు డీడీలు తీసి దరఖాస్తు చేసుకోవా ల్సి ఉంటుంది. అయితే ఆయా మండలాల వ్యవసా య అధికారులు ఈ పథకానికి సంబంధించి నెల రోజులుగా దరఖాస్తులను తీసుకుంటున్నారు. కానీ రైతుల నుంచి ఆశించిన మేరకు దరఖాస్తులు రావడం లేదు. ఆయా మండలాలకు ఈ పథకం కింద కేటాయించిన యూనిట్ల సంఖ్యలో కనీసం 25 శాతం మేరకు కూడా దరఖాస్తులు రాలేదు.
జిల్లాకు రూ.రెండు కోట్ల బడ్జెట్
ఈ పథకం కింద ఇచ్చే యంత్ర పరికరాలకు ఇచ్చే సబ్సిడీ కోసం ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.ఆరు కోట్లు మంజూరు చేసింది. తొలి విడతలో రూ.రెండు కోట్లు కేటాయించింది. కానీ నెల రోజులుగా రైతులు చేసుకున్న దరఖాస్తుల యంత్ర పరికరాల సబ్సిడీ సుమారు రూ.60 లక్షలకు మించి లేదు. అంటే కేటాయించిన నిధుల్లో కనీసం 30 శాతం లోపే దరఖాస్తులు వచ్చినట్లు స్పష్టమవుతోంది.
సబ్సిడీపై పెదవి విరుపు
ఈ పథకం కింద రైతులకు పంపిణీ చేస్తున్న యంత్ర పరికరాలకు నామమాత్రంగా సబ్సిడీ ఉందని రైతులు పేర్కొంటున్నారు. పురుగుమందులు పిచికారీ చేసే స్ప్రేయర్లకు కేవలం రూ.800 సబ్సిడీ ఉంది. ట్రాక్టర్‌లకు అమర్చే యంత్ర పరికరాలకు సుమారు రూ.50 వేల వరకు సబ్సిడీ వస్తోంది. ఈ సబ్సిడీ మొత్తం తక్కువగా ఉందనే కారణంతో రైతుల నుంచి ఆశించిన మేరకు దరఖాస్తులు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దరఖాస్తులు స్వీకరిస్తున్నాం
వ్యవసాయ యాంత్రీకరణకు దరఖా స్తులు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు కొందరు రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో కొందరికి మంజూరు చేశాం. తొలివిడత పరికరాలు పంపిణీ చేస్తే మరింత మంది రైతులు దరఖాస్తులు చేసుకునేందుకు ముందుకు వస్తారని ఆశిస్తున్నా. దరఖాస్తులు చేసుకునేందుకు ఇంకా సమయం అప్పటిలోగా సబ్సిడీ నిధులు పూర్తి స్థాయిలో వినియోగం అవుతాయని ఆశిస్తున్నాము.
– శివప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
గతంలో ట్రాక్టర్లు ఇచ్చే వారు..
గత ప్రభుత్వ హయాంలో ఈ పథకం కింద 50 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లు మంజూరు చేశారు. రాజకీయ పలుకుబడి ఉన్న నేతలకే ఈ ట్రాక్టర్లు దక్కాయి. దీంతో రూ.లక్షల్లో సబ్సిడీ నిధులు అతి తక్కువ మంది జేబుల్లోకి వెళ్లాయి. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఇప్పుడు ట్రాక్టర్లు కాకుండా, చిన్న, చిన్న యంత్ర పరికరాలు ఎక్కువ సంఖ్యలో రైతులు లబ్ధిపొందేలా పథకానికి రూపకల్పన చేశారు. అయితే ఇచ్చే సబ్సిడీ తక్కువగా ఉండటంతో ఆశించిన మేరకు దరఖాస్తులు రాలేదు. ప్రభుత్వం ఈ సబ్సిడీ మొత్తాన్ని కాస్త పెంచితే రైతుల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత
ఈ వ్యవసాయ యాంత్రీకరణ పథకం దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈసారి పూర్తి స్థాయిలో అమలవుతోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2017లో ఈ పథకం అమలైంది. తర్వాత అటకెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించింది. గత ఆర్థిక సంవత్సరంలో చివర మార్చిలో నామమాత్రంగా రైతులకు యంత్ర పరికరాలు ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని నిర్ణయించారు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.


