చెరుకు రైతులకు రాయితీల ఆఫర్
● ఫిబ్రవరిలో చెరుకు తరలించే వారికే వర్తింపు ● క్రషింగ్ పెంచుకునే ప్రయత్నంలో గోదావరి–గంగా యాజమాన్యం ● టన్నుకు రూ.200లు అదనంగా ధర చెల్లించనున్నట్లు ప్రకటన ● ఎకరాకు రూ.4 వేలు బోనస్ రాయితీలు ● కర్మాగారం క్రషింగ్ లక్ష్యం 3.50 టన్నులు
జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని మాటూర్ గ్రామంలోని గోదావరి–గంగా చక్కెర కర్మాగారం లక్ష్యం మేరకు చెరకును గానుగాడించేందుకు సన్నద్ధం అవుతోంది. 2025–26 సీజన్‌కు గాను 3.50లక్షల టన్నుల చెరకును గానుగాడించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు కర్మాగారం వర్గాలు పేర్కొన్నాయి. ఫిబ్రవరి 15 తేదీ తర్వాత కర్మాగారానికి చెరకును తరలించుకునే రైతులకు టన్నుకు రూ.200 అదనంగా ఇవ్వడంతో పాటు ఎకరాకు రూ.4వేల వంతున బోనస్ చెల్లించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. ఎకరాకు 30 టన్నుల మేర దిగుబడి వస్తే అదనపు ధర, రాయితీలు కలుపుకొని 10వేల వరకు రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతులు పక్క రాష్ట్రాలకు చెరకును తరలించుకోకుండా ఉండేందుకు వీలుగా యాజమాన్యం ఈ మేరకు రాయితీలు ప్రకటించినట్లు కర్మాగారం వర్గాలు పేర్కొన్నాయి. గత ఏడాది కర్మాగారం 1.16లక్షల టన్నుల మేర చెరకు పంటను క్రషింగ్ చేసింది. ఈ ఏడాది మాత్రం దీన్ని 3.50లక్షలకు పెంచుకోవాలనే ప్రయత్నంలో ఉంది. కర్మాగారం క్రషింగ్ సామర్థ్యం రోజుకు 2,800 టన్నుల మేర ఉంది. ఫిబ్రవరిలో క్రషింగ్‌కు చెరుకును తరలించుకోవడం వల్ల రైతులకు అదనపు ధర లభించనుండగా, మంచి రికవరీ వచ్చి యాజమాన్యానికి సైతం లబ్ధి చేకూరనుంది. ఈ సీజన్‌కు గాను కర్మాగారం రైతులకు టన్నుకు రూ.3,800 ధర ప్రకటించింది. ఫిబ్రవరిలో 15వ తేదీ తర్వాత చెరకును సరఫరా చేసే రైతులకు మాత్రం టన్నుకు రూ.4,000 ధర లభించనుంది. గోదావరి–గంగా కర్మాగారానికి కోహీర్, ఝరాసంగం, న్యాల్‌కల్, రాయికోడ్, రేగోడ్ మండలాల నుంచి చెరకును తరలించుకునేందుకు అధికారులు అనుమతించారు. ఆయా మండలాలే కాకుండా జహీరాబాద్ మండలంలోని 9 గ్రామాలు, మొగుడంపల్లి మండలాల్లోని 5 గ్రామాలను చేర్చారు. తాము ప్రకటించిన అదనపు ధర, రాయితీల మూలంగా ఆయా ప్రాంతాల రైతులు పక్క రాష్ట్రాలకు చెరకును తరలించుకోకుండా ఉండే అవకాశం ఉందనే ఆశాభావంతో యాజమాన్యం ఉంది.
కర్మాగారం నిర్ణయంతో రైతులకు లబ్ధి
గోదావరి–గంగా కర్మాగారం యాజమాన్యం ప్రకటించిన రాయితీలను ఉపయోగించుకుంటే రైతులకు లబ్ధి చేకూరనుంది. జోన్ పరిధిలో ఉన్న రైతులు పక్కరాష్ట్రాలకు చెరకును తరలించుకోకుండా నిర్ణయించిన కర్మాగారానికే సరఫరా చేసుకోవాలి. పక్క రాష్ట్రాలకు చెరకు వెళ్లకుండా అదనపు ధరతో పాటు రాయితీలు ఇచ్చేందుకు యాజమాన్యం ముందుకు రావడం సంతోషకరమైన విషయం.
–రాజశేఖర్, కేన్ అసిస్టెంట్ కమిషనర్
సంగారెడ్డి
చెరుకు రైతులకు రాయితీల ఆఫర్


