మంజీరాపై వంతెన, డ్యామ్ నిర్మాణానికి సన్నాహాలు
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: మంజీరా నదిపై వంతెన, డ్యామ్ నిర్మాణానికి గాను విశ్రాంత ఎస్‌ఈ యేసయ్య, డీఈ విఠల్‌రావు, ఖేడ్ ఇరిగేషన్ డీఈ జలందర్‌లతో కలిసి ఎమ్మెల్యే సంజీవరెడ్డి సోమవారం పరిశీలించారు. మనూరు మండలం రాయిపల్లి వద్ద వంతెన, డ్యాం నిర్మాణానికి సంబంధించి అనువైన ప్రాంతాన్ని పరిశీలించారు. జిల్లా తాగు, సాగు నీటి అవసరాలు అధికంగా మంజీరాపై నదిపై ఆధారపడి ఉండంతో ఈ ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టిన పక్షంలో భవిష్యత్‌లో నీటి ఇబ్బందులు ఉండవని నిర్ధారించారు. నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్ నియోజకవర్గాలకు సంబంధించి నీటి పథకాలు ఈ ప్రాంతంలో ఉండడంతో ఇక్కడ డ్యాం నిర్మాణంతో ఎంతటి వేసవిలో అయినా బ్యాక్ వాటర్ ప్రాంతం కావడంతో నీటి నిల్వలు ఉండనున్నాయి. సింగూరు నుంచి దిగువకు నీటిని వదిలినా ప్రాంతంలో నీటి నిల్వ భారీగా ఉండి పథకాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిర్ధారించారు. దీనికి తోడు వ్యవసాయానికి సైతం నీటిని వాడుకొనే అవకాశం ఉండనుంది. ఇందుకు సంబంధించిన స్థల పరిశీలన చేపట్టారు. అధికారుల నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు.
పేదల సొంతింటికల సాకారం
ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నా రు. ఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని చాంద్‌ఖాన్‌పల్లిలో లబ్ధిదారు యాదమ్మ, మనూరు మండలంలోని మష్నూబీకి చెందిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు పూర్తికావడంతో సోమవారం గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పేరిట మభ్యపెట్టిందే తప్ప న్యాయం చేయలేదన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరుకాగా పలు నిర్మాణాలు పూర్తికాగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. విడతలవారీగా అర్హులైన పేదలందరికీ మంజూరవుతాయన్నారు.


