చెరుకు ఇక్కడ చేదే..!
జిల్లాలో గోదావరి గంగా ఆగ్రో ప్రొడక్ట్స్, గణేశ్ షుగర్ పరిశ్రమలు ఉన్నాయి. జహీరాబాద్‌లో ఉన్న ట్రైడెంట్ షుగర్ పరిశ్రమ కొన్నేళ్ల క్రితం మూతపడింది. దీంతో ఇక్కడి ప్రాంతంలో కొంతమేర సాగు విస్తీర్ణం తగ్గింది. రెండేళ్ల క్రితం రాయికోడ్ మండలం మాటూరు గ్రామ శివారులో కొత్తగా గోదావరి ఆగ్రో ప్రొడక్ట్స్ పరిశ్రమ స్థాపించారు. దీంతో చెరుకు పంట సాగు విస్తీర్ణం పెరగనుంది. జిల్లావ్యాప్తంగా 36 వేల ఎకరాల విస్తీర్ణంలో చెరుకు పంట సాగు అవుతుండగా.. ఇందులో అత్యధికంగా జహీరాబాద్ ప్రాంతంలో సాగు అవుతుంది. పంట సాగు కోసం పెట్టుబడులు ఖర్చులు పెరుగుతున్నాయని, ఒక ఎకరా విస్తీర్ణంలో పంట సాగు చేసేందుకు రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. అలాగే.. రవాణా చార్జీలు యాజమాన్యాలు రైతుల నెత్తిపైనే వేస్తున్నాయి. మాటూర్ పరిశ్రమ గతేడాది టన్నుకు రూ.3,700 చెల్లిస్తే ఈసారి రూ.3,800కు పెంచుతున్నట్లు తెలుస్తోంది. రూ.100లు పెంచుతూనే ఒక టన్నుకు రూ.66లు రవాణా చార్జీలు పెంచనున్నట్లు సమాచారం.
పొరుగు రాష్ట్రాల్లో అధిక ధర
తెలంగాణలో కంటే కర్ణాటక, మహారాష్ట్రలో చెరుకు పంటకు అధిక ధర పలుకుతోంది. ఇక్కడ పంట కోతతో పాటు రవాణా చార్జీలు పోను టన్నుకు రూ.2,600 వరకు మాత్రమే లభిస్తుంది. ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తే ఒక టన్నుకు రూ.3,300 చెల్లిస్తున్నారు. జహీరాబాద్ కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉండటంతో ఇక్కడి ప్రాంత రైతులు విక్రయించే అవకాశాలు ఉన్నాయి. కాగా, చెరుకు పంట సాగు చేస్తున్న రైతులు రూ.4,500 కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రైతులు నష్టపోకుండా ధరను నిర్ణయించాలని కలెక్టర్ ఆదేశించారు.
చెరుకు టన్నుకు రూ.3,826
సీడీసీ చైర్మన్ రాంరెడ్డి
సంగారెడ్డి టౌన్: మండలం పరిధి ఫసల్వాది గ్రామ శివారులోని గణపతి షుగర్ ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ కార్యక్రమాన్ని చెరకు అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్, చైర్మన్ రాంరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గణపతి షుగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ సంవత్సరం నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు క్రషింగ్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. టన్నుకు రూ.3826 ధర ప్రకటించిన్నట్లు చెప్పారు. 40 కిలోమీటర్ల పైన వెహికల్ ట్రాన్స్‌పోర్టు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. కార్యక్రమంలో చెరుకు రైతులు తదితరులు పాల్గొన్నారు.
మద్దతు ధర లేక రైతులకు నష్టాలు
ఇక్కడి కంటే కర్ణాటకలోనే అధిక ధర
ఏటా పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు
రూ.4,500 మద్దతు ధరకు
ఎదురుచూపులు
జిల్లాలో చెరుకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పెట్టుబడి ఖర్చులు పెరిగి.. మద్దతు ధర లేకపోవడంతో నష్టాల పాలవుతున్నారు. ఆయా పరిశ్రమల యాజమాన్యాలు ఇష్టానుసారంగా ధరలను నిర్ణయించి కొనుగోలు చేస్తున్నాయని రైతులు చెబుతున్నారు. – సంగారెడ్డి జోన్:
ఖర్చులు పరిశ్రమలే భరించాలి
పంట కోతతోపాటు రవాణా ఖర్చుల్ని పరిశ్రమలే భరించాలి. నేను ఆరెకరాల్లో పంట సాగు చేస్తున్నాను. గతంలో పరిశ్రమలు లేకపోవటంతో బెల్లం తయారు చేసే వాళ్లం. బెల్లం తయారీకి కూలీలు ఎక్కువగా అవసరమయ్యేవారు. పరిశ్రమల రాకతో అక్కడికి తరలిస్తున్నాం.
– దత్తు, చెరుకు రైతు, బర్దీపూర్, ఝరాసంగం
గిట్టుబాటు అయ్యే విధంగా చూడాలి
చెరుకు పంట సాగు చేస్తున్న తమకు పరిశ్రమలు గిట్టుబాటు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. గతంలో పదెకరాల్లో సాగు చేయగా ప్రస్తుతం 4 ఎకరాలకు వచ్చింది. పంట సాగు చేసే రైతులకు మద్దతు ధర కల్పించి, సహకరించాలి.
– విఠల్ రెడ్డి, చెరుకు రైతు, గ్రా.ముంగి, మం.న్యాల్‌కల్


