జలం.. పుష్కలం
భూమికి సమాంతరంగా వ్యవసాయ బావుల్లో నీటిమట్టం
జహీరాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వ్యవసాయ బావులు, బోర్లులో నీటి ఊటలు భూమికి సమాంతరంగా వచ్చాయి. అధికంగా వర్షాలు కురియడం వల్ల భూగర్భంలో నీటి ఊటలు భారీగా పెరిగాయి. జహీరాబాద్ ప్రాంతంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లోని వ్యవసాయ బోర్లలో నుంచి నీరు పైకి చిమ్ముకుంటూ వస్తోంది. కరెంటు మోటారు సహాయం లేకుండానే తానంతట అవే పారుతున్నాయి. వ్యవసాయ బావుల్లో నుంచి సైతం నీరు జాలువారుతోంది. గత మార్చి నుంచి భారీ వర్షాలు కురియడం వల్ల భూగర్భ జలాల నీటి మట్టం బాగా పెరిగింది. నీటిని భూమి పీల్చుకునే స్థితి లేక పోవడంతో పొలాల్లో నుంచి సైతం నీలు ఇంకా జాలువారుతోంది. జూన్ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 766 మి.మీ కాగా ఇప్పటి వరకు 1085.4 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో ఈ ఏడాది 319మి.మీ వర్షపాతం అధికంగా కురిసింది. గత ఏడాది 785.6 మి.మీ వర్షపాతం నమోదైంది. మూడేళ్ల నుంచి అధికంగా వర్షాలు కురుస్తుండటం కూడా భూగర్భ జలాలు పెరిగేందుకు కారణమైంది. జిల్లాలోని నాలుగు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, కంగ్టి, నాగల్‌గిద్ద, కొండాపూర్, ఝరాసంగం, నిజాంపేట్, పుల్‌కల్ మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది.
భూమికి సమాంతరంగా భూగర్భజలాలు
బోర్లలో నుంచి ఉబికి వస్తున్న నీరు
వ్యవసాయ బావులదీ అదే పరిస్థితి
ఈ ఏడాది 319 మి.మీ అధిక వర్షపాతం నమోదు


