ఆటలతో పోటీతత్వం పెంపు
నారాయణఖేడ్: క్రీడలతో విద్యార్థుల్లో పోటీతత్వం, వ్యక్తిత్వ వికాసం పెంచుతాయని కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. నారాయణఖేడ్‌లో సబ్ కలెక్టర్ ఉమాహారతి, ఎస్‌డీఎం ఆధ్వర్యంలో విరూపాక్ష ఆర్గనైజేషన్ సంస్థ సీఎస్‌ఆర్ నిధులు, హైదరాబాద్ ఆధారిత టోకెన్ ఆర్గనైజేషన్ సహకారంతో క్విజ్ పోటీలు నిర్వహించారు. శుక్రవారం ముగింపు సందర్భంగా గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్, సబ్ కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. పోటీలతో జ్ఞానం, వ్యక్తిత్వ వికాసానికి దోహద పడుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రతీ రోజు చదివే అంశాలను క్విజ్ రూపంలో ప్రశ్నించడం ద్వారా విద్యార్థులకు విషయ సంగ్రహన శక్తి, మేధాశక్తి పెరుగుతోందని చెప్పారు. దీంతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారని పేర్కొన్నారు. కొన్ని పాఠశాలల్లో ఉదయం ప్రార్థన సమయంలో దినపత్రికల్లోని ముఖ్యాంశాలు చదివి వినిపిస్తున్నారని, దీంతో విద్యార్థుల్లో జనరల్ నాలెడ్జ్ పెరుగుతుందని చెప్పారు. ఈ విధానం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో చేపట్టాలని సూచించారు. కాగా, మొదటి బహుమతి నిజాంపేట్ మండలం బాచేపల్లి ఎంజేపీ పాఠశాల, రెండో బహుమతి నాగల్‌గిద్ద మండలం కరస్‌గుత్తి టీజీటీ డబ్ల్యూర్‌జేసీ బాలికల పాఠశాల, మూడవ బహుమతి నారాయణఖేడ్ బాలుర టీజీఎస్ డబ్ల్యూఆర్‌జేసీ పాఠశాల విద్యార్థులు దక్కించుకున్నారు.
హాస్టల్ తనిఖీ
నారాయణఖేడ్: పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల వసతిగృహాన్ని శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ప్రావీణ్య స్థానిక సబ్ కలెక్టర్ ఉమా హారతితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులలో విద్యార్థినిల సామర్థ్యం, వంటశాల, ఆహార నాణ్యతను వంటగదిని వసతిగృహంలోని సౌకర్యాలను పరిశీలించారు. బాలికలను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని వసతిగృహం సంక్షేమ అధికారిణి బాలమణికి సూచించారు.
కలెక్టర్ పి.ప్రావీణ్య
విజేతలకు బహుమతుల ప్రదానం


