ఓ కూలీ.. ఇటు రా..!
న్యాల్‌కల్(జహీరాబాద్): కూలీల కొరత రైతన్నకు పెద్ద సమస్యగా మారింది. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటలు.. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో నష్టాలను చవిచూడాల్సిన దుస్థితి నెలకొంది. ఉన్న పంటలను తీసుకుందామనుకుంటే కూలీల కొరత సమస్యగా మారింది. స్థానికంగా కూలీల కొరత ఉండడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో అధిక రేటు ఇచ్చి ఇతర ప్రాంతాల నుంచి కూలీలను రప్పిస్తున్నారు. జిల్లాలో గత ఏడాది 3.50 లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేసుకోగా.. ఈ ఏడాది 3.48,775 ఎకరాల్లో సాగు చేసుకున్నారు. మూడేళ్ల క్రితం ఎకరాకు 8 నుంచి 13 క్వింటాళ్ల పత్తి పంట దిగుబడి రాగా ఈ ఏడాది కురిసిన భారీ వర్షాల వల్ల దిగుబడులు గణనీయంగా తగ్గాయి. క్వింటాలు ధర రూ,.8,110లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ధర కొంత మేర ఆశాజనకంగా ఉన్నా.. దిగుబడులు తగ్గడంతో తాము నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా పొలంలోని పంటను తీసేందుకు కూలీలు దొరకక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, దేవరకొండ, కర్నూల్, కర్నాటక తదితర ప్రాంతాల నుంచి ఆటోలు, ఇతర వాహనాలు సమకూర్చి రప్పిస్తున్నారు. గత ఏడాది కూలీలకు కిలో పత్తి తీసేందుకు రూ.11 చెల్లించారు. ఈ ఏడాది రూ.13 చెల్లిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూలీలను రప్పించేందుకు అయ్యే రవాణా ఖర్చులు కూడా అదనం. వారానికి ఒకసారి దావత్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఫలితంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలంలోంచి పత్తి (కిలో) తీసేందుకు రవాణా ఇతర ఖర్చులు కలిపి రూ.16 వరకు వస్తుందని చెబుతున్నారు. పత్తి తీసేందుకు మొదటి దశలోనే కూలీల కొరత ఇలా ఉంటే మిగిలిన దశల్లో కూలీలు దొరుకుతారా? లేదా? పంట తీసేదెలా అని రైతులు వాపోతున్నారు.
కొరతతో రైతుల తీవ్ర అవస్థలు
ఇతర ప్రాంతాల కూలీలపై దృష్టి
ఖర్చులు పెరగడంతో తీవ్ర నష్టం
పత్తి రైతుల ఆందోళన


