అరటి.. ఇదేమిటి..?
జహీరాబాద్ టౌన్: ఏ సీజన్‌లోనైనా అరటికి మంచి డిమాండ్ ఉంటుంది. ఏడాది పొడవునా సాగుకు అనుకూలంగా వాణిజ్యపరంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడంతో రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే.. గతంలో ఎన్నడూలేని విధంగా అరటి రైతులు నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కనీసం పెట్టుబడి కూడా రాని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పండించిన పంటకు మద్దతు ధర లేకుండా పోయిందని వాపోతున్నారు. రెండు నెలల క్రితం ఉన్న ధరలో సగానికి పడిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఏడాది పొడువునా అరటికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఎర్రటి, నల్లరేగడి నేలలు సాగుకు అనుకూలం. జహీరాబాద్ డివిజన్‌లో వ్యవసాయ బావులు ఎక్కువగా ఉండటంతో నీటికి తడులకు ఢోకాలేదు. జహీరాబాద్, కోహీర్, రాయికోడ్, ఝరాసంగం, న్యాల్‌కల్, గుమ్మడిదల, కొండాపూర్ తదతర మండలాల్లో అరటి ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతుంది. జిల్లాలో సుమారు వెయ్యి ఎకరాల్లో అరటి పంట ఉండగా ఒక్క జహీరాబాద్ డివిజన్‌లోనే సుమారు 500 ఎకరాల్లో పంట సాగవుతుంది.
పడిపోయిన ధరలు
అరటి ధరలు భారీగా పడిపోయాయి. నెల రోజుల క్రితం టన్నుకు రూ.15–18 వేలు పలుకగా ఒక్కసారిగా రూ.5–7 వేలకు పడిపోయింది. మహారాష్ట్రలో ఈసారి పంట సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. ఇదే సమయంలో పెద్ద ఎత్తున మార్కెట్‌కు రావడంతో ఎగుమతులు తగ్గిపోయి ధరలు పడిపోయాయి. మహారాష్ట్ర ప్రభావం ఇక్కడి రైతులపై పడింది. గతంలో వ్యాపారులు పొలం వద్దకు వచ్చి గెలలు విక్రహించాలని ముందే అడ్వాన్స్ ఇచ్చే వారు. ఇప్పుడు వ్యాపారుల వద్దకు వెళ్లి ఎంతో కొంత ఇచ్చి తీసుకోవాలని కోరినా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు.
తీవ్రంగా నష్టపోతున్నాం
ఒక్కసారిగా అరటి ధరలు పతనంతో తీవ్రంగా నష్టపోతున్నాం. ముఖ్యంగ సన్న చిన్నకారు రైతులకు ఎక్కువ నష్టం కల్గుతుంది. ధర లేక పంట కోయకపోవడంతో తోటల్లోనే అరటి కాయలు మగ్గిపోతున్నాయి. ఽరైతుల నుంచి స్థానిక వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్‌లో మాత్రం డజను రూ.50 చొప్పున వినియోగదారులకు విక్రయిస్తున్నారు. ధరలు స్థిరంగా ఉంచడానికి ప్రభుత్వం మద్దతు ధరను అందించాలి.
– కరణం రవికుమార్, రైతు, బాబానగర్
ధరలు పతనం
పెట్టుబడి రాని వైనం
నష్టపోతున్న రైతులు
మద్దతు ధర అందించాలని డిమాండ్


