సేంద్రియం జాడేది?
వృథాగా ఎరువుల తయారీ కేంద్రాలు
పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు గత ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. అందులో భాగంగా పట్టణాల్లో మాదిరిగా గ్రామాల్లో సేకరించిన తడి, పొడి చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేసేలా ప్రణాళికలు చేశారు. ఇందుకనుగుణంగా కంపోస్ట్ షెడ్లను సైతం నిర్మించారు. కాగా ప్రస్తుతం వాటిని ఉపయోగించకపోవడంతో నిరుపయోగంగా మారాయి.
– సంగారెడ్డి టౌన్
సంగారెడ్డి జిల్లాలోని 648 గ్రామాలు, 25 మండలాల్లో కంపోస్టు షెడ్డులు నిర్మించారు. స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా రోజు నివాస ప్రాంతాల నుంచి చెత్తను సేకరించి కంపోస్టు ఎరువుగా మార్చి పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో పంచాయతీలో ఏర్పాటు చేశారు. పారిశుధ్యం మెరుగుపరిచేందుకు నిర్మించిన అవి ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. ఒక్కో కంపోస్టు షెడ్ నిర్మాణానికి లక్షల్లో ఖర్చు చేశారు. కానీ గ్రామ పంచాయతీలు ఈ షెడ్లను ఉపయోగించడం లేదు. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త దర్శనమిస్తోంది. ఇండ్ల నుంచి సేకరించిన ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, ఎలక్ట్రానిక్, ప్లాస్టిక్ బాటిళ్లు తదితర వ్యర్థాలను వేరు చేసి ఎరువుగా మార్చే పదార్థాలను కంపోస్టు గుంతల్లో వేస్తారు. ఎరువుగా మారిన అనంతరం గ్రామ పంచాయతీల పరిధిలో హరితహారంలో నాటిన మొక్కలు, నర్సరీల్లో ఎరువుగా ఉపయోగించాలని నిర్ధేశించారు. ప్లాస్టిక్ బాటిళ్లు, గాజు సీసాలు, ఇతర వస్తువులను విక్రయించడం ద్వారా పంచాయతీలకు ఆర్థిక వనరులు చేకూరుతాయని లక్ష్యంగా ప్రారంభించిన ఈ పథకం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతుంది. జిల్లాలోని పలు గ్రామాల్లో నిర్మించిన కంపోస్టు షెడ్‌లు అలంకారప్రాయంగా ఉన్నాయి.
కాలుష్య రహిత గ్రామాలే లక్ష్యం
గ్రామాల్లో చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పారబోయడం ద్వారా వాటిలోని రసాయనాలు భూమిలోకి చేరి తద్వారా నేల, నీరు కలుషితం అవుతోంది. చెత్త కుళ్లిపోయి దుర్గంధం, కాల్చడం వల్ల వెలువడే పొగ కాలుష్యాన్ని నివారించి పర్యావరణహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉపాధిహామీ ద్వారా గ్రామాల్లో కంపోస్టు షెడ్‌ల నిర్మాణం చేపట్టారు. వ్యర్థాలను అక్కడికి తరలించి వాటితో సేంద్రియ ఎరువులను తయారు చేసి రైతులకు అందించాలని నిర్ణయించారు. తద్వారా భూసారాన్ని పరిరక్షించాలనే ప్రణాళికతో రూపొందించిన ఈ పథకం అమలుకు నోచుకోవడం లేదు. షెడ్‌లను వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
కానరాని ప్రణాళిక
గ్రామాల్లో ఇంటింటికీ చెత్త బుట్టలు పంపిణీ చేశారు. అధికారులు వ్యర్థాలను కంపోస్ట్ షెడ్‌లకు తరలించాలని ప్రణాళికలు రూపొందించారు. కానీ గ్రామ పంచాయతీల్లో వ్యర్థాలను నేరుగా కంపోస్టుకు తరలించకుండా బయట ఎక్కడో ఒక చోట పారబోసి చేతులు దులుపుకుంటున్నారు.
పర్యవేక్షణ లోపం
పలు గ్రామాల్లో చెత్తను డంపింగ్ యార్డుకు తరలించడం లేదు. అధికార యంత్రాంగం పర్యవేక్షణ లోపంతోనే తరలించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి యార్డుల నిర్వహణ పూర్తిస్థాయిలో చేపట్టి గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూర్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రోడ్లపై దర్శనమిస్తున్న చెత్త
గ్రామాలకు అదనపు ఆదాయం నిల్
పట్టించుకోని అధికారులు


