కందిపైనే ఆశలు..!
● వర్షాలతో దెబ్బతిన్న పంటలు ● ఆశాజనకంగా కంది ● సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు
జహీరాబాద్ టౌన్: వర్షాల వల్ల ఈ సంవత్సరం చాలా వరకు ఖరీఫ్ సీజన్ పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు కురవడం వల్ల చేతికి వచ్చిన పంటలు వర్షార్పణం అయ్యాయి. పెసర, మినుము పంటలు పూర్తిగా దెబ్బతినగా.. పత్తి, సోయాబిన్ పంటల దిగుబడిపై ప్రభావం పడింది. కంది పంట పర్వాలేదు అన్నట్లుగా ఉంది. పెసర, పత్తి, సోయాబిన్ తదితర పంటల్లో ఏర్పడిన నష్టాన్ని కంది పంటలో భర్తీ చేసుకోవాలని రైతులు ఆశతో ఉన్నారు. కంది పూత, కాత దశలో ఉంది. సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.
జిల్లాలో ఖరీప్ సీజన్‌లో రైతులు సుమారు 7.75 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అఽత్యధికంగా సుమారు 3.75 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేశారు. సుమారు 86 వేల ఎకరాల్లో రైతులు కంది సాగు చేస్తున్నారు. కంది అంతర పంటగా ఎక్కువ మంది వేశారు. ఇతర పంటలతో పోల్చితే కంది పంటలకు వాతావరణం అన్ని రకాలు అనుకూలంగా ఉంది. పంట ఏపుగా పెరిగి పూత, కాత దశలో ఉంది. ఒకటి రెండు నెలల్లో పంట చేతికి అందే అవకాశం ఉంది. ఈ ఏడాది పంట ఆశాజనకంగా ఉండడంతో ఎకరానికి 8 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందన్న నమ్మకం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతర పంటలో ఎకరానికి 5 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు. కంది పంట మద్దతు ధర కూడా పెరగడంతో రైతులకు కొంత ఊరట లభించింది. దెబ్బతిన్న పంటల కారణంగా ఏర్పడిన నష్టాన్ని కందితో పూడ్చుకొనే అవకాశం రైతులకు కల్గుతుంది. నెల రోజుల పాటు కంది పంటకు చాలా కీలకమని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. తెగుళ్లు, పురుగుల ఉధృతి ఎక్కువగా ఉండే సమయం కాబట్టి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.


