లక్ష్యం సాధించాలి
● అధికారులకు కలెక్టర్ ఆదేశం ● ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణంపై సమీక్ష
సంగారెడ్డి జోన్: జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం కోసం నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సూక్ష్మ నీటి సేద్యం, సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, జాతీయ వెదురు మిషన్, వర్షాధార ప్రాంతాల అభివృద్ధి పథకం వంటి పథకాల అమలు ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరానికి గాను 3,750 ఎకరాల్లో సాగు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు పేర్కొన్నారు. రైతులకు అర్హత ప్రకారం ప్రోత్సాహకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వాలు చేపట్టే పథకాలు రైతుల స్థాయిలో ఫలితాలను ఇవ్వాలంటే సమయపాలనతో పాటు సాంకేతిక మార్గదర్శకాలను అమలు చేయాలన్నారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణలో భాగంగా గోద్రెజ్ ఆగ్రోవేట్ ఆధ్వర్యంలో మండల వారీగా రైతుల అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరారు. సమావేశంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి సీహెచ్ పండరి, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఏడీఎస్ అధికారులు, ఉద్యాన విభాగ సిబ్బంది, గోద్రెజ్ ఆగ్రోవేట్ జనరల్ మేనేజర్ స్వీటీ వేగుంట, తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి
– అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
ప్రజావాణిలో భాగంగా వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. ఈ మేరకు 59 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, డిఆర్‌ఓ పద్మజరాణి పాల్గొన్నారు.
సీపీఆర్‌పై అవగాహన కలిగి ఉండాలి
గుండెపోటు, శ్వాస తీసుకోవడంలో సమస్య వచ్చిన సమయంలో ప్రాణాలు కాపాడే సీపీఆర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో సీపీఆర్‌పై అధికారులకు అవగాహన కల్పించారు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
సంగారెడ్డి జోన్: జిల్లాలో రెండు రోజులలో వంద శాతం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కలెక్టరు ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం వరిధాన్యం కొనుగోళ్లపై మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తో పాటు అధికారులు హాజరయ్యారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్‌లు ఏర్పాట్లు చేయాలన్నారు. సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలన్నారు. అదనపు కలెక్టర్ మాధురి, డీఆర్‌డీఏ పీడీ జ్యోతి, డీఏఓ శివ ప్రసాద్, డీసీవో కిరణ్ కుమార్, డీఎం సివిల్ సప్లై అంబదాస్ రాజేశ్వర్ తదితర శాఖాధికారులు పాల్గొన్నారు.


