ఏడాదిలోగా సూర్యభగవాన్ ఆలయం
సాకి చెరువు కట్టపై నిర్మాణం
ఎంపీ రఘునందన్, ఎమ్మెల్యే గూడెం హామీ
వైభవంగా ఛట్ పూజలు
ఛట్ పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే
పటాన్‌చెరు/జిన్నారం (పటాన్‌చెరు): అన్ని ప్రాంతాల ప్రజలను గౌరవించే గొప్ప సాంప్రదాయం తెలంగాణ ప్రజలదని ఎంపీ రఘనందన్‌రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజా సందర్భంగా పటాన్‌చెరులోని సాకి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో, అలాగే.. బొల్లారం పారిశ్రామికవాడలో జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భగవంతుడి కృపతో వచ్చే సంవత్సరం ఛట్ పూజల్లోపు సాకి చెరువు కట్టపై సూర్య భగవాన్ దేవాలయం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక ఘాట్ సైతం నిర్మిస్తామని తెలిపారు. ఉత్తర భారతీయుల సంస్కృతి సాంప్రదాయాలకు గౌరవిస్తామన్నారు. వారికి అన్నివేళలా అండగా ఉంటామన్నారు. తెలంగాణ ప్రజలతో సమానంగా అన్ని రాష్ట్రాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని చెప్పారు. విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం పటాన్‌చెరు నియోజకవర్గం అని పేర్కొన్నారు. అనంతరం ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం.మాజీ ఎమ్మెల్యే మనో జ్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, అలాగే.. మాజీ జెడ్పీటీసీ బాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు చంద్రారెడ్డి, హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


