
బాణాసంచా ధరలు.. పేలుతున్నాయ్
దీపావళి సామగ్రి కొనుగోలుదారులతో సందడి కిటకిటలాడుతున్న మార్కెట్లు
సంగారెడ్డి క్రైమ్: దీపావళి అంటేనే సిరుల పండుగ. దీప కాంతులు, బాణాసంచా వెలుగుల మధ్య పండుగను జరుపుకుంటారు. పట్టణంలో దీపావళి సందడి మొదలైంది. వేడుకలకు బాణాసంచా వేదిక అవుతుండగా వాటి కొనుగోళ్లు మార్కెట్‌లో ప్రారంభమయ్యాయి. పట్టణంలోని మండే మార్కెట్, మహిళా ప్రాంగణం ఎదురుగా, పీఎస్‌ఆర్ గార్డెన్‌లో ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేశారు. పట్టణంలో చిన్నారులకు ఎంతో ఇష్టమైన చిచ్చుబుడ్లకు, తారాజువ్వలకు భారీ డిమాండ్ పెరిగింది. అలాగే కాకరవొత్తులు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయినా సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కోసం అటు పిల్లలు ఇటు పెద్దలు ఆనందం కోసం వెచ్చించక తప్పడం లేదు. ఆ కారణంగానే దుకాణాలకు వెళ్లే వినియోగదారులపై ధరల మోత మోగుతోంది. టపాకాయల అమ్మకాలు లేక సతమతమవుతున్న వ్యాపారులు ఇదే అదునుగా అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
20% ధరలు పెరుగుదల
గత సంవత్సరంతో పోలిస్తే టపాకాయలకు ఈసారి ధరలు భారీగా పెరిగాయి. మార్కెట్‌లో ఏకంగా 20 నుంచి 30% మేర ధరలు పెంచారు. దీంతో సాధారణ, మధ్యతరగతి ప్రజలు టపాసులు కొనుగోలు తగ్గించారు. పట్టణంలో టపాకాయల ధరలు చిచ్చుబుడ్ల బాక్సు ధర రూ.200 నుంచి 600, తౌజెండ్ వాలా రూ. 600 నుంచి 1500, 5 తౌజెండ్ వాలా రూ. 3వేల నుంచి 3500 వరకు, భూచ్రకాలు బాక్స్ సైజును బట్టి రూ.50 నుంచి 300, 30 షార్ట్స్ రూ. వెయ్యి నుంచి 2 వేలు, రాకెట్లు బాక్సు ధర రూ.150 నుంచి 1500, మిర్చి ప్యాకెట్ ధర రూ.50 నుంచి 100 వరకు విక్రయిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే వీటి ధరలో 20 నుంచి 30 శాతం వరకు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. అలాగే గతంతో పోలిస్తే విక్రయాలు కూడా భారీగా పడిపోయాయని పేర్కొంటున్నారు.
గతేడాదితో పోలిస్తే పెరిగిన ధరలు
విక్రయాలు భారీగా తగ్గాయి
మార్కెట్‌లో చిన్న పిల్లలకు అటు యువతకు నచ్చేలా అన్ని రకాల టపాకాయలు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది దుకాణాల సంఖ్య పెరగడంతో విక్రయాలు భారీగా తగ్గాయి. దీంతో ఆశించిన మేర లాభాలు రావడం లేదు.
– ఆకాశ్, దుకాణదారుడు, సంగారెడ్డి

బాణాసంచా ధరలు.. పేలుతున్నాయ్