
అరచేతిలో సమగ్ర సమాచారం
రైతుల కోసం
ప్రత్యేకంగా వాట్సాప్ ఛానల్
జిల్లాలో 30 శాతం రైతుల చేరిక
వ్యవసాయంలో రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలు నేరుగా అందించేందుకు ప్రభుత్వం సాంకేతికతను తీసుకొస్తుంది. పంటల సాగు, చీడ, పీడల గురించి పూర్తి సమాచారం రైతులు తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా వాట్సాప్ ఛానల్ ఇటీవల ప్రారంభించింది. ఇందులో ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న రైతులు వ్యవసాయ శాఖ అధికారులు అందించే లింక్ ద్వారా చేరవచ్చు. గ్రామాల్లో ఇప్పటికే రైతులకు ఈ చానల్‌పై అవగాహన కల్పిస్తున్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ నిపుణులు ఆన్‌లైన్ ద్వారా రైతులకు సూచనలు, సలహాలు అందిస్తారు.
– మెదక్ కలెక్టరేట్
రైతులు వారికి కావాల్సిన సమాచారాన్ని పూర్తిగా తెలుగులోనే పొందవచ్చు. పంటలకు తెగుళ్లు, క్రిమికీటకాలు సోకినప్పుడు రైతులు ఈ ఛానల్ ద్వారా కావాల్సిన సమాచారం పొందవచ్చు. ప్రస్తుతం రైతులు ఆశించిన స్థాయిలో వ్యవసాయ సమాచారం లేకపోవడంతో పంటల్లో దిగుబడులు కోల్పోతున్నారు. చీడ,పీడలతో పంటలు దెబ్బతిని ఆర్థికంగా నష్టపోతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ రైతులకు ఒకేసారి సమాచారం పొందడానికి ఈ డిజిటల్ వ్యవసాయ పరిజ్ఞానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. విత్తన దశ నుంచి పంట చేతికి వచ్చే వరకు పంటల పూర్తి సమాచారం రైతులు తెలుసుకోవచ్చు.
ఏఈఓల ద్వారా చేరవచ్చు
మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓలు రైతులను ఈ ఛానల్‌లో లింక్ ద్వారా చేర్చుతున్నారు. పంటలకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా క్షణాల్లో పొందవచ్చు. అన్ని సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుంది. సమయం, ఖర్చు తగ్గుతుంది.
ప్రభుత్వ పథకాలు
ప్రభుత్వం ఏ పంటకు ఎంత సబ్సిడీ ఇస్తుంది. ఏ సీజన్‌లో ఏ పంట సాగుచేస్తే ప్రయోజనం ఉంటుంది. వాతావరణ సమాచారం, విత్తనం నాటు వేయడం, కోత తీయడం పద్ధతులతోపాటు సస్యరక్షణలో తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తల గురించి సమాచారం పొందవచ్చు. సీజన్‌ల వారీగా పంటలు సాగు చేసి, చీడ, పీడలను ఽఅధిగమించి రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చు. అందుకోసం వాట్సాప్ ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
వ్యవసాయశాఖలో
సాంకేతిక విప్లవం