
ప్రాణాలు తీసుకుని.. ఆవేదన మిగిల్చి..
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల ఐదుగురుబలవన్మరణానికి పాల్పడ్డారు.
ఉరి వేసుకొని మహిళ..
నిజాంపేట(మెదక్): ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... నిజాంపేటకు చెందిన విభూతి జ్యోతి, నర్సింహులు దంపతులు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత నెలలో మహబూబ్‌నగర్‌కు కుమారుడు అనిల్‌కుమార్‌తో సహా వలస వెళ్లారు. ఈ క్రమంలో కుమారుడికి ఫిట్స్ రావడంతో వాగులో పడి చనిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన జ్యోతి(41) ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి చీరతో ఉరి వేసుకుంది. గమనించిన ఆమె భర్త ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది.
ములుగులో వివాహిత..
ములుగు(గజ్వేల్): వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండలంలోని కొక్కొండ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం మేరకు... దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లికి చెందిన అశ్విని(26)కి కొక్కొండకు చెందిన గుండ్రెడ్డిపల్లి రవిగౌడ్‌తో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. కాగా కొద్ది రోజులుగా అశ్వినితో భర్తతోపాటు మరిది, అత్త తరుచూ గొడవపడేవారు. ఈ విషయం అశ్విని తన తండ్రికి పలుమార్లు చెప్పినప్పటికీ సర్దుకు పోవాలని సూచించేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అశ్విని ఇంట్లో ఉరివేసుకుంది. ఆమె మృతిపట్ల అనుమానం వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మద్యానికి బానిసై యువకుడు..
శివ్వంపేట(నర్సాపూర్): మద్యానికి బానిసైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని గంగాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై మధుకర్‌రెడ్డి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మహబూబ్(25) ప్రైవేటు పరిశ్రమలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. మద్యానికి బానిసై కొన్నాళ్ల నుంచి విధులకు వెళ్లకపోవడంతో తల్లి చాంద్‌బీ మందలించింది. ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులు బిజ్లిపూర్‌లో ఫంక్షన్‌కు వెళ్లి రాత్రి 11 గంటలకు ఇంటికి రాగా మహబూబ్ ఇంట్లో ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అప్పుల బాధతో..
కౌడిపల్లి(నర్సాపూర్): అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని సలాబత్‌పూర్‌లో జరిగింది. ఎస్సై మురళి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నెల్లూరి వెంకటేశ్(51) మూడేళ్ల క్రితం అప్పుచేసి కూతురు పెళ్లి చేశాడు. ఓ వైపు పెళ్లికి చేసిన అప్పులు తీరక, మరోవైపు కూతురు జీవితం బాగాలేకపోవడంతో కుటుంబ సభ్యులకు చెప్పుకుని బాధపడేవాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరులేని సమయంలో ఇంటిదూలానికి ఉరివేసుకున్నాడు.
మానసిక ఆందోళనతో..
చిన్నశంకరంపేట(మెదక్): మానసిక ఒత్తిడితో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని గజగట్లపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ నారాయణగౌడ్ కథనం మేరకు... గ్రామానికి చెందిన రెడ్డి యాదగిరి కుమారుడు ప్రసాద్(20) ఇంటి వద్దే ఉంటూ పనులు చేసుకుంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత బైక్ తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో స్నేహితులు, బంధువుల వద్ద ఆరా తీశాడు. సోమవారం ఉదయం రెక్కలగుట్ట వద్ద బైక్ కన్పించడంతో గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి వెళ్లి వెతకగా చెట్టుకు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు.
నిందితుడికి జీవిత ఖైదు
మెదక్ మున్సిపాలిటీ: ఓ కేసులో నిందితుడికి కోర్టు జీవితఖైదుతోపాటు, జరిమాన విధించింది. జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు వివరాలు... సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం సేవాలాల్ తండాకు చెందిన ఫకీరానాయక్ 2020 నవంబర్ 10న జిల్లా కేంద్రంలోని ఓ కల్లు దుకాణం వద ఓ మహిళ ను పరిచయం చేసుకున్నాడు. ఆమెతో మాటలు కలిపి చేగుంట రోడ్ వైపు ఉన్న ధర్మకుంట సమీపంలోకి తీసుకెళ్లి కామవాంఛ తీర్చుకున్నాడు. అనంతరం ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో ఫకీరానాయక్ పక్కన ఉన్న బాటిల్‌ను పగులగొట్టి మహిళ గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటనపై అప్పట్లోనే కేసు నమో దు చేసిన పోలీసులు సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ నిందితుడికి జీవిత ఖైదుతోపాటు, రూ.15 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

ప్రాణాలు తీసుకుని.. ఆవేదన మిగిల్చి..

ప్రాణాలు తీసుకుని.. ఆవేదన మిగిల్చి..

ప్రాణాలు తీసుకుని.. ఆవేదన మిగిల్చి..

ప్రాణాలు తీసుకుని.. ఆవేదన మిగిల్చి..