
వడ్డీ వ్యాపారుల నయా దందా
భూములు రిజిస్ట్రేషన్ చేస్తేనే అప్పులు
● సర్వహక్కులు కోల్పోయే ప్రమాదం ● తేడాలొస్తే భవిష్యత్‌లో ఇబ్బందులే ● మార్టిగేజే బెటర్ అంటున్న న్యాయ నిపుణులు
గతంలో బంగారం కుదవపెట్టి, ప్రామిసరీ నోట్లు రాసిస్తే వడ్డీ వ్యాపారులు అప్పులిచ్చేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసిస్తేనే అప్పులు ఇస్తున్నారు. ఈ నయా దందాకు వడ్డీ వ్యాపారులు తెరలేపారు. అయితే ఈ విధానంతో భవిష్యత్తులో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు, పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా మార్టిగేజ్ చేసి బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటే తీసుకున్న వారు సేఫ్‌గా ఉంటారని చెబుతున్నారు.
– జోగిపేట(అందోల్)
జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫైనాన్స్‌కు చెందిన వారు సిండికేట్‌గా ఏర్పడి జోగిపేట, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లోని రైతులకు, చిన్న చిన్న వ్యాపారులకు అధిక వడ్డీతో అప్పులు ఇస్తున్నారు. ఇందుకు భూములనే కాకుండా భవనాలు, కమర్షియల్ షట్టర్‌లను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు.
దళారులకు పండుగ
వ్యవసాయ భూమిపై అప్పులిస్తామని చెప్పి ప్రతి గ్రామంలో ఒకరిద్దరూ దళారులు ఉన్నారు. వారు అప్పు ఇచ్చే వ్యక్తులకు తీసుకునే వారిని పరిచయం చేసి డబ్బులు ఇప్పించి రిజిస్ట్రేషన్ వరకు ప్రధాన బాధ్యత తీసుకుంటారు. ఇలా రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు 2 శాతం కమీషన్‌ను తీసుకుంటున్నారు.
ఇటీవల ఓ ఘటన
డాకూరు గ్రామానికి చెందిన బోయిని కృష్ణ అందోలు మండలంలోని కొంత మంది రైతులకు, ప్రైవేట్ వ్యక్తులకు అప్పులిచ్చి భూములను తన పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఇదే భూమిని రూ.50 లక్షలు, కోటి రూపాయల వరకు ఇతరులకు అమ్ముకున్నాడు. అప్పు తీసుకున్న రైతులు లబోదిబోమన్నారు. ఇప్పటి వరకు రూ.20 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉడాయించాడు. డాకూరు గ్రామానికి చెందిన భాగయ్య కృష్ణపై కేసు పెట్టాడు. కాగా ఆరు మాసాలుగా కృష్ణ పరారీలో ఉన్నాడు.
భూమి వాల్యూ తక్కువతోనే..
అధికారికంగా భూముల విలువ తక్కువగా ఉండటంతో బ్యాంకర్లు ఆ మేరకు రుణాలు ఇస్తున్నారు. ఎకరాకు రూ.2.50 లక్షల నుంచి రూ.3.60 లక్షలు మాత్రమే వాల్యూ ఉండటం వల్ల బ్యాంకర్లు భూమిని మార్టిగేజ్ చేసుకొని రూ.2 లక్షల వరకు రుణాలు ఇస్తున్నారు. ప్రైవేట్ ఫైనాన్స్ అయితే ఎకరాకు రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఇస్తున్నట్లు సమాచారం. ఇక్కడ డబ్బులు తీసుకున్నప్పుడు, విడిపించుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఆ ఫీజును అప్పు తీసుకున్న వ్యక్తే చెల్లించాలి. దీంతో అదనపు భారం పడటంతోపాటు భూమిపై సర్వహక్కులు కోల్పోవలసి వస్తుంది.