
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్
హవేళిఘణాపూర్(మెదక్): యువకులు సైబర్ నేరాలు, డ్రగ్స్ భారిన పడకుండా తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్‌చంద్రబోస్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని ముత్తాయికోటలో విద్యార్థులు నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్ శిబిరంలో పాల్గొని మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసై ఎందరో తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిపారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మురళి, డాక్టర్ శరత్, సాయికిరణ్, నాగరాజు, హెచ్‌ఎం రఘుబాబు, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
రేషన్ బియ్యం స్వాధీనం
శివ్వంపేట(నర్సాపూర్): అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సీసీఎస్ పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు. సోమ వారం మండల పరిధిలోని పాంబండలో సీసీఎస్ పోలీసులు దాడులు చేసి ఓ పౌల్ట్రీపామ్‌లో 12 బస్తాల రేషన్ బియ్యం (6 క్వింటాళ్లు) పట్టుకున్నారు. అనంతరం రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని శివ్వంపేట పీఎస్‌కు తరలించారు. వారి ఫిర్యాదు మేరకు సివిల్ సప్లయ్, రెవెన్యూ సిబ్బంది విచారణ చేపట్టారు.
ముగ్గురు దొంగలు అరెస్టు
మద్దూరు(హుస్నాబాద్): ధాన్యాన్ని అపహరించి తీసుకెళ్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మండలంలోని కూటిగల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ షేక్ మహబూబ్ కేసు వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన అల్ద కొమురయ్య మొక్కజొన్న పంటను కోసి ఆరబెట్టాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి హుస్నాబాద్, అక్కపేట మండలాలకు చెందిన గంటల శంకర్, పండుగ సతీశ్, బడుగు సంపత్ సుమారు 12 క్వింటాళ్ల మక్కలను అపహరించి హుస్నాబాద్‌కు తరలిస్తున్నారు. రాత్రి వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు అనుమానాస్పందగా కనిపించడంతో విచారించగా దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
మద్యం మత్తులో
యువకుల వీరంగం
కారుకు అడ్డుగా వెళ్లి దంపతులపై దాడి
వట్‌పల్లి(అందోల్): మద్యం మత్తులో ఇద్దరు యువకులు దంపతులపై దాడి చేశారు. ఈ ఘటన సోమవారం మండలంలోని అల్మాయిపేట వద్ద చోటుచేసుకుంది. ఎస్‌ఐ పాండు వివరాల ప్రకారం... టేక్మాల్ గ్రామానికి చెందిన భక్తుల వీరప్ప ఆయన సతీమణి వరలక్ష్మితో కలిసి సంగారెడ్డి నుంచి వస్తున్న క్రమంలో అందోల్ గ్రామానికి చెందిన జాఫర్, షాహిద్ బైక్‌పై వస్తూ కారును ఓవర్‌టేక్ చేశారు. ఈ క్రమంలో ముందుకు వెళ్లి బైక్‌ను కారుకు అడ్డుపెట్టి కారు నడుపుతున్న వీరప్పను బయటకు లాగి దాడి చేశారు. ఈ క్రమంలో ఆయన సతీమణిపై కూడా దాడి చేయగా అటువైపుగా వెళ్లేవారు అడ్డుకున్నారు. ఈ దాడిలో భార్యాభర్తలకు గాయాలయ్యాయి. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
అక్రమ నిర్మాణాల తొలగింపు
జహీరాబాద్ టౌన్: మున్సిపల్ పరిధిలోని రంజోల్‌లో అక్రమ నిర్మాణాలను మున్సిపల్, రెవెన్యూ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య సోమవారం తొలగించారు. రంజోల్ గ్రామ పరిధిలోని 111 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో కొంత మంది అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. సుమారు 10 అక్రమ కట్టడాలను గుర్తించారు. గ్రామంలో ఒక రోజు ముందు దండోరా వేయించి అనంతరం జేసీబీతో అక్రమ కట్టడాలు, రేకుల షెడ్లను కూల్చివేశారు. ప్రభుత్వ స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి