
అలా ఎలా లెక్కిస్తారు?
మున్సిపాలిటీ పరిధిలో భూములకు
గ్రామీణ ప్రాంత రేట్లతో పరిహారం
తీవ్రంగా నష్టపోతామంటున్న
చింతలపల్లి నిర్వాసితులు
ప్రజా ప్రతినిధులు, అధికారులకు
వినతిపత్రాలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అధికారులు చేసిన తప్పిదాల కారణంగా రీజనరల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ రహదారి నిర్మాణంలో సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చింతలపల్లి ప్రాంతం భూములు కోల్పోతున్నారు. అయితే ఈ భూములు కోల్పోతున్న రైతులకు చెల్లించే పరిహారం విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని నిర్వాసిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూములకు మున్సిపాలిటీ ధరల ప్రకారం లెక్కించి పరిహారం చెల్లించాల్సి ఉండగా, రెవెన్యూ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే భూముల ధరలతో లెక్కించి పరిహారం చెల్లించాలని చూస్తున్నారని ఈ నిర్వాసిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చింతలపల్లి గ్రామం 2018లోనే సంగారెడ్డి మున్సిపాలిటీలో విలీనమైందని చెబుతున్నారు. అయితే రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదన 2020 తర్వాత తెరపైకి వచ్చింది. కానీ పరిహారం చెల్లింపు విషయానికి వస్తే ఈ గ్రామాన్ని గ్రామ పంచాయతీలో ఉండే భూముల ధరలతో ఎలా లెక్కిస్తారని ప్రశ్నిస్తున్నారు. తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న తమ భూములను లాక్కోవద్దని ఈ నిర్వాసిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా పరిహారం చెల్లింపుల్లోనూ అధికారులు అన్యాయం చేస్తున్నారని, తమకు మార్కెట్ రేటు ప్రకారం తగిన పరిహారం చెల్లించకపోతే భూములు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు.
రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో సంగారెడ్డి జిల్లాలో మూడు మండలాల్లోని 13 గ్రామాల పరిధిలో రైతులు భూములు కోల్పోతున్నారు. సంగారెడ్డి, సదాశివపేట, కొండాపూర్, హత్నూర మండలాల పరిధిలో ఈ గ్రామాలున్నాయి. ఇందులో చింతలపల్లి కూడా ఒకటి. రెవెన్యూ అధికారులు ఈ రైతులకు పరిహారం చెల్లించేందుకు ఇప్పటికే 24 డ్రాఫ్ట్ అవార్డును ప్రకటించారు. ఈ క్రమంలో చింతలపల్లి నిర్వాసితులకు గ్రామీణ ప్రాంత రేట్లతో పరిహారం చెల్లించేలా అవార్డు ఇచ్చారని నిర్వాసిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటున్నారు.
నేతల చుట్టూ రైతులు
తమ సమస్యను పరిష్కరించాలని పలువురు నిర్వాసిత రైతులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. నేషనల్ హైవే అథారిటీ, రెవెన్యూ అధికారులకు పలు మార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని తమ సమస్యను పరిష్కరించాలని ఇటీవల టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి వినతి పత్రం అందజేశారు. అలాగే ఎంపీ రఘునందర్‌రావుకు కూడా వినతిపత్రం అందజేయాలని ఈ నిర్వాసిత రైతులు నిర్ణయించారు. తమకు తగిన పరిహారం అందించేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
13 గ్రామాల్లో
నిర్వాసితులు
ట్రిపుల్‌ఆర్ ప్రాజెక్టులో
భూ నిర్వాసితుల ఆందోళన