
రైతు కమతాల్లోనే కల్లాలు
● నిర్మాణాలకు కేంద్రం సుముఖం ● రైతులకు భారీ ప్రయోజనం ● రోడ్లపై పంటలు ఆరబెట్టే బెడదకు ఫుల్‌స్టాప్
నారాయణఖేడ్: పండించిన పంటల రైతులు ఆరబెట్టేందుకు కల్లాల సదుపాయం లేక రోడ్లపై పంటలను ఆరబెట్టడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలామంది రైతులు కొనుగోలు కేంద్రాలకు తమ పంట ఉత్పత్తులను ఆరబెట్టకుండానే తీసుకొస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలన్నింటినీ నివారిస్తూ రైతులకు వెసులుబాటు కల్పించేందుకు కేంద్రం కల్లాల నిర్మాణాలకు సూత్రపాయంగా అంగీకరించింది. ఉపాధిహామీ పథకంలో కల్లాల నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు ఇస్తామని పేర్కొంది. కల్లాల ఏర్పాటుతో రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. 2021– 22లో కల్లాల నిర్మాణాలు ఉపాధి హామీ పథకంలో అప్పట్లో చేపట్టారు. అయితే కేంద్రం అనుమతి లేకుండా నిర్మించారని వాటిని మధ్యలో నిలిపివేశారు. అప్పట్లో 50, 60, 75 చదరపు మీటర్ల చొప్పున మూడు రకాలుగా కల్లాలను నిర్మించారు. 50 చదరపు మీటర్ల కల్లానికి రూ.50 వేలు, 60కు రూ.62వేలు, 75 చదరపు మీటర్లకు రూ.78వేల వరకు చెల్లించారు. కొంత మొత్తం కూలీ కింద చెల్లింపులు జరగగా మెజార్టీ డబ్బులు మేటీరియల్ కాంపోనెంట్ కింద అందజేశారు. అప్పట్లో రైతులు కల్లాల నిర్మాణాలకు ముందుకు వచ్చారు. మధ్యలో నిలిచిపోవడంతో పథకం అప్పటినుంచి కొనసాగలేదు.
కల్లాల నిర్మాణాలకు కేంద్రం చర్యలు
జిల్లాలో సుమారు 70వేల జాబ్ కార్డులు ఉండగా 2,11,054మంది కూలీలు పనులు చేస్తున్నారు. సీసీఐ పత్తి కొనుగోళ్ల అంశం, రైతులు పత్తి పంటను ఆరబెట్టకుండానే తెస్తున్నారనే అంశాలపై కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో జరిగిన చర్చ సందర్భంగా ప్రస్తావన రావడంతో ఉపాధి హామీలో కల్లాల నిర్మాణాలకు అనుమతిస్తామని మంత్రి గిరిరాజ్‌సింగ్ వెల్లడించారు. ప్రతీ పంచాయతీలోనూ కల్లాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలని సూచించడంతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కల్లాల నిర్మాణంపై దృష్టి సారించింది. రైతుల అవసరం మేర కల్లాలను నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నారు.
మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు
కల్లాల నిర్మాణంపై మార్గదర్శకాలకనుగుణంగా చర్యలు చేపడతాం. అవసరమైన ప్రతిపాదనలు పంపిస్తాం. గతంలో కల్లాల నిర్మాణం చేపట్టినా మధ్యలో నిలిచిపోయింది. ప్రస్తుతం వచ్చే మార్గదర్శకాల మేరకు తగు చర్యలు తీసుకుంటాం. కల్లాల నిర్మాణంతో రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
– బాల్‌రాజ్, అదనపు పీడీ,
డీఆర్‌డీఏ, సంగారెడ్డి

రైతు కమతాల్లోనే కల్లాలు