
రెండో విడత పాఠ్యపుస్తకాలు పంపిణీ
● జిల్లాకు చేరుకున్న పుస్తకాలు ● వీటితోపాటు డిజిటల్ బుక్స్ అందజేత
జహీరాబాద్ టౌన్: ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం రోజు నుంచే ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాంలు అందించడం ప్రారంభించారు. పార్ట్–1 సిలబస్ పూర్తి కావస్తుండగా రెండో విడత పార్ట్–2 పుస్తకాల పంపిణీకి అధికారులు సిద్ధం చేశారు. ఇటీవలే మండల కేంద్రాలకు పుస్తకాలు సరఫరా అయ్యాయి. మండల విద్యాధికారి కార్యాలయం నుంచి పాఠశాల సిబ్బంది బడులకు చేరవేస్తున్నారు. గతేడాది పంపిణీలో ఆలస్యం కావడంతో ఈ సంవత్సరం జాప్యాన్ని నివారించేందుకు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
పార్ట్–2 పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందించాల్సి ఉండగా జిల్లాకు 80% రెండవ విడత పుస్తకాలు వచ్చాయి. వీటిని జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు పంపిణీ చేస్తున్నారు. పాఠశాలలకు సులువుగా పంపిణీ చేసేందుకు సబ్జెక్టులు, తరగతుల వారీగా పుస్తకాలను విభజించారు. పార్ట్–2 పుస్తకాలను విద్యార్థులకు 15 రోజుల క్రితమే పంపిణీ చేయాల్సి ఉండగా దసరా సెలవులు రావడంతో వాయిదా వేశారు. సెలవులు ముగియడంతో పుస్తకాల పంపిణీని ప్రారంభించారు.
జిల్లావ్యాప్తంగా 4,31,872 పాఠ్యపుస్తకాలు మండల కేంద్రాలకు చేరవేశారు. వీటితో పాటు డిజిటల్ బోధన అందించేందుకు 6,7,8,9 తరగతి విద్యార్థులకు మరో 1,07,968 పుస్తకాలు వచ్చాయి. పార్ట్–2 పుస్తకాలతో పాటు డిజిటల్ బుక్స్ కూడా విద్యార్థులకు అందజేయనున్నారు. నోట్‌బుక్స్, తెలుగు, ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాలను జూన్‌లో పార్ట్–1 పుస్తకాలతోపాటు అందజేశారు. ప్రస్తుతం సబ్జెక్ట్ బుక్స్ మాత్రమే పంపిణీ చేస్తున్నారు.