
ప్రభుత్వాస్పత్రిలో లీగల్ ఎయిడ్ క్లినిక్స్
సంగారెడ్డి: లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ద్వారా సమాజంలోని ప్రతి వ్యక్తికి న్యాయసేవలను అందించడమే ప్రధాన లక్ష్యమని జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర ఆదేశాల మేరకు సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించడంలో భాగంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, సంగారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని డీ–అడిక్షన్ / రిహాబిలిటేషన్ సెంటర్ వద్ద లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను శుక్రవారం సౌజన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు,పునరావాసం పొందుతున్న రోగులకు న్యాయసంబంధిత సలహాలు, మార్గదర్శకత్వం, అవసరమైతే ఉచిత న్యాయ సహాయం అందజేస్తారన్నారు. కుటుంబ, ఆస్తి, ఉద్యోగం, గృహహింస, పునరావాసానికి సంబంధించిన చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం ఈ క్లినిక్ ద్వారా సహాయం పొందవచ్చని తెలిపారు. ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్‌లో ప్రతీ శనివారం ఒక ప్యానల్ లాయర్, ఒక పారా లీగల్ వలంటీర్‌ను విధులకు వస్తారని వెల్లడించారు. ఈ సేవలు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయ అధికారి నాగనిర్మల, డా.శశాంక్, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ మురళీకృష్ణ, బాలస్వామి, అడ్వొకేట్ ఖాలేద్ , ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
కార్యదర్శి సౌజన్య