
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
మిరుదొడ్డి(దుబ్బాక): రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని ధర్మారం జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... దుబ్బాక గ్రామానికి చెందిన నూనె అశోక్, సుశాంత్ బైక్‌పై సిద్దిపేట నుండి దుబ్బాకకు వెళుతున్న క్రమంలో ధర్మారం శివారులో అదుపు తప్పి ప్రమాద సూచిక బోర్డును బలంగా ఢీకొట్టారు. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆటో ఢీకొని..
నారాయణఖేడ్: ఆటో, కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన నాందేడ్– అకోలా 161 జాతీయ రహదారిపై నిజాంపేట్ మండలం బాచేపల్లి సమీపంలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా రేగోడ్ మండలం నుంచి ఆటోలో యూరియా బస్తాలను కంబాపురం తరలిస్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న మందాల వీరప్ప, అమృత్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వారికి ఖేడ్ ఏరియా ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు.