
స్మార్ట్ సిటీకి అడుగులు
ఝరాసంగం మండలంలోని నిమ్జ్ ప్రాంతం
సంగారెడ్డి జోన్: జహీరాబాద్ నియోజకవర్గంలోని నిమ్జ్ ప్రాంతంలో ఏర్పాటు కాబోతున్న స్మార్ట్ సిటీకి అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీగా ప్రకటించి ఏడాది పూర్తి కావొస్తున్నా, అభివృద్ధి పనులకు ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. అయితే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి స్మార్ట్ సిటీ అభివృద్ధి కోసం ఆమోదించిన నిధులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కోరారు. ఈ మేరకు నిధులు మంజూరు కావడంతో అభివృద్ధి పనులు ప్రారంభించే అవకాశం ఉంది.
3,200 ఎకరాలు.. రూ. 2,361 కోట్లు
జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి అమలు ట్రస్ట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్– నాగపూర్ పారిశ్రామిక అభివృద్ధి అమలులో భాగంగా ప్రాజెక్టును నెలకొల్పుతున్నారు. ఇందుకోసం సుమారు 3,200 ఎకరాల విస్తీర్ణంలో రూ. 2,361 కోట్ల నిధులతో పనులు చేపట్టనున్నారు. ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల్లో ఏర్పాటవుతున్న నిమ్జ్ (జాతీయ ఉత్పాదక పెట్టుబడుల మండలి) పరిధిలోని బర్దిపూర్, ఎల్గోయి, చిలపల్లి, చీలపల్లి తండా గ్రామాల శివారులో స్మార్ట్ సిటీ ఏర్పాటు కాబోతుంది. ఇందులో భాగంగా పారిశ్రామికవాడలో రహదారులు, తాగునీరు, విద్యుత్ సౌకర్యంతో పాటు మౌలిక వసతుల కోసం అభివృద్ధి చేయనున్నారు. కేటాయించిన భూములను ఇటీవల టీజీఐఐసీ ఎండీ శశాంక్‌తో పాటు కలెక్టర్ ప్రావీణ్య ఇతర అధికారులు పరిశీలించారు. ప్రాజెక్టులో భాగంగా అవసరమయ్యే భూములను గుర్తించి ఫెన్సింగ్ వేయాలని అధికారులకు ఆదేశించారు. నవంబర్ వరకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు రూపకల్పన చేస్తున్నారు.
కొనసాగుతున్న భూ సేకరణ
నియోజకవర్గంలోని ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల్లో వివిధ గ్రామాల్లో నిమ్జ్ ప్రాజెక్టు కోసం భూములు గుర్తించారు. 12 వేల ఎకరాలకుపైగా భూములు స్వీకరించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి విడతలో బర్ధిపూర్, ఎల్గోయి, చీలపల్లి, చిలపల్లి తండా గ్రామాల్లో 3,600 ఎకరాల భూమిని సేకరించారు. గత ప్రభుత్వ హయాంలో భూసేకరణ నిలిచిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు వేగవంతం చేసింది. అయితే ఇప్పటివరకు సుమారు 8,000 ఎకరాల వరకు భూమి సేకరణ పూర్తి కాగా, మిగితా భూమి సేకరణ కొనసాగుతోంది.
నిమ్జ్ పరిసర గ్రామాల్లో ఏర్పాటు
3,200 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టు
నిర్మాణానికి రూ. 2,361 కోట్లు
త్వరలో టెండర్ ప్రక్రియ, ప్రారంభం కానున్న పనులు
మారనున్న రూపురేఖలు
స్మార్ట్ సిటీ రాకతో జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాలతో పాటు సరిహద్దు కర్ణాటక రాష్ట్రం బీదర్ ప్రాంతం రూపురేఖలు మారనున్నాయి. ఈ ప్రాజెక్టును దృష్టిలో ఉంచుకొని జహీరాబాద్ మీదుగా హైదరాబాద్– ముంబై హై స్పీడ్–బుల్లెట్ రైలు వెళ్లేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఇప్పటికే హుగ్గెల్లి నుంచి నిమ్జ్ ప్రాంతానికి రహదారి ఏర్పాటు చేశారు. స్థానికంగా పరిశ్రమలు రావడంతో ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడి అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి.