
ఇక ఇసుక బజార్లు..
జిల్లాలో 10చోట్ల ఏర్పాటుకు చర్యలు
● అనుమతి ఇచ్చిన ‘టీజీఎండీసీ’
● ఇందిరమ్మ లబ్ధిదారులకు తక్కువ ధరకు పంపిణీ
నారాయణఖేడ్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరగడంతో పాటు నిర్మాణ దారులకు ఇసుక ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం ఇసుక బజార్లను ఏర్పాటు చేస్తుంది. జిల్లాలో 10 ఇసుక బజార్ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఇందులో మూడింటికి తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ) అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం జిల్లాలో ఆందోల్, నారాయణఖేడ్ మండలంలోని జకల్ శివారులో ఇసుక బజార్లను ఏర్పాటు చేసింది. మరో వారం పది రోజుల్లో కోహీర్ మండలంలోని కవేలి వద్ద మరొకటి ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో జహీరాబాద్ నియోకవర్గంలోని సింగీతం, జహీరాబాద్, ఝరాసంఘం మండలంలోని మాచ్నూర్, సంగారెడ్డి, సదాశివపేట్ మండలంలోని సిద్దాపూర్, పటాన్‌చెరు నియోజకవర్గంలోని చిట్కుల్, జిన్నారం, ఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మండలంలోని మునిగేపల్లి గ్రామాల్లో ఇసుక బజార్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. వీటి ద్వారా లబ్ధిదారులకు వారి వారి ఇళ్ల నిర్మాణాల స్టేజీలను బట్టి ఇసుకను అందించనున్నారు. అన్‌లైన్ ద్వారా డబ్బులు చెల్లించి ఇసుకను పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఇసుక బజార్లకు నల్గొండ, సిద్దిపేట జిల్లాలోని కొండపాక ప్రాంతాల నుంచి ఇసుక సరఫరా జరిగింది. ప్రస్తుతం టన్నుకు రూ. 1,200 చొప్పున అందజేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు కామారెడ్డి జిల్లాలోని రీచ్‌లను ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడి నుంచి ఇసుక సరఫరా జరిగితే ధర మరింత తగ్గే అవకాశం ఉంది.
జోరుగా నిర్మాణాలు
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం 4 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. జిల్లాలో 14,538 ఇళ్లు మంజూరు కాగా, 4,291 ఇళ్లు బేస్‌మెంట్ లెవల్‌లో ఉన్నాయి. 655 ఇళ్లు రూఫ్‌లెవల్, 183 ఆర్సీసీ స్టేజీలో ఉన్నాయి. వివిధ స్థాయిలో ఉన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో అధికారులు డబ్బులు జమ చేశారు.