
విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు
ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు
జహీరాబాద్: రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు విమర్శించారు. శనివారం జహీరాబాద్‌లో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా విభాగ్ అభ్యాస వర్గ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం రూ. 8,500 కోట్ల పైచిలుకు ఫీజు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. దీంతో యాజమాన్యాలు విద్యాసంస్థలను నడపలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో విద్య కోసం బడ్జెట్‌లో 13 నుంచి 14 శాతం కేటాయింపులు చేస్తుంటే, మన రాష్ట్రంలో మాత్రం అందులో సగం కూడా కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ అధ్వాన్నంగా మారందన్నారు. గ్రూప్–1 నియామకాలకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేపడితేనే వాస్తవాలు బహిర్గతం అవుతాయన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని, ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏబీవీపీ నాయకులు ఆకాష్, రాజు, ఆదిత్య, లక్ష్మణ్, జిల్లా ప్రముఖ్ మాధవరెడ్డి, అగ్రి విజన్ స్టేట్ కన్వీనర్ మానస, స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్ ఉదయ్‌సాగర్ తదితరులు పాల్గొన్నారు.