
భర్త వేధింపులతోనే..
నారాయణఖేడ్: మద్యానికి బానిసై అదనపు కట్నం వేధింపులకు తోడు అనుమానం ఆ కుటుంబంలో పెనుభూతంలా మారింది. భర్త పెట్టే వేధింపులు భరించలేక ఇద్దరు పిల్లల గొంతు నులిమి, తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై ఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి శనివారం వివరాలు వెల్లడించారు. నిజాంపేట్‌కు చెందిన బూషి సాయమ్మ, రాములు కుమార్తె ప్రేమల (22)ను నాలుగేళ్ల క్రితం దామర చెరువు గ్రామానికి చెందిన కొత్తపల్లి సంగమేశ్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వివాహమైన అనంతరం అదనపు కట్నం కోసం తరచూ ప్రేమలను వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం ధనుష్, 45 రోజుల క్రితం మరో కుమారుడు జన్మించాడు. ఇటీవల బారసాల నిర్వహించి బాబుకు సూర్యవంశీ అని నామకరణం కూడా చేశారు. ఈనెల 1న ప్రేమలను అత్తవారింటికి పిల్లలతో సహా పంపించారు. గురువారం సంగమేశ్ తన భార్య ప్రేమల, ఇద్దరు పిల్లలను నిజాంపేట్‌లోని పుట్టింటికి తీసుకొచ్చి వదిలి వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఆమె తల్లిదండ్రులు, సోదరుడు జైపాల్ పొలం పనులకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రేమల కుమారులు ధునుష్ (3), సూర్యవంశీ (45 రోజులు) ఊపిరి ఆడకుండా గొంతు నులిమి చంపి, తాను కూడా ఉరివేసుకుంది. పనులు ముగించుకొని కుటుంబ సభ్యులు సాయంత్రం ఇంటికి రాగా ప్రేమల, ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా పడి ఉండటం గమనించారు. భర్త, ఆయన సంబంధీకులే హత్య చేసి ఉంటారని అనుమానించారు. ఘటన జరిగిన రాత్రి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి వివరాలు సేకరించారు. భర్త సంగమేష్ అదనపు కట్నం, అనుమానం వేధింపులే తన కూతురి మృతికి కారణమని తండ్రి బూసి రాములు పోలీసులు ఫిర్యాదు చేశాడు. మృతదేహాలకు ఖేడ్ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
అదనపు కట్నానికి తోడు
అనుమాన భూతం
చిన్నారుల గొంతు నులిమి
తాను ఆత్మహత్య
డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీం విచారణ
వివరాలు వెల్లడించిన డీఎస్పీ

భర్త వేధింపులతోనే..