
హైహై వినాయక
పటాన్‌చెరు: పటాన్‌చెరులో గ్రామాలు లేవు. పంచాయతీ ఎన్నికలు లేవు. చాలా గ్రామాలు మున్సిపాలిటీలుగా మారాయి. కొత్తగా వచ్చిన జనాలతో కాలనీలు పెరిగాయి.. ఓటర్లు పెరిగారు. ఆ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు వినాయక ఉత్సవాలను వేదికలుగా చేసుకుంటూ నయాతరం నేతలు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. మారుతున్న రాజకీయ పరిణామాలకు ఈ వినాయక ఉత్సవాలు వేదికలుగా మారుతున్నాయి. భక్తులకు, మండప నిర్వాహకులకు, కాలనీ సంఘాల వారికి దగ్గరయ్యేందుకు యువనేతలు చేస్తున్న ప్రయత్నాలు నయా ట్రెండ్‌గా మారాయి. వినాయక ఉత్స వాల నిర్వహణకు యువజన సంఘాలు, కాలనీ సంఘాలు రాజకీయవేత్తల సహకారాన్ని కోరడం సహజం. అయితే ఈ ఏడాది వినాయక ఉత్సవాల్లో మాత్రం కొందరు నాయకులు ప్రజల దృష్టిలో పడేందుకు చేస్తున్న ప్రయత్నాలు వైరెటీగా ఉన్నా యి. మండపాల సందర్శనను చిన్న వీడియోల రూపంలో పెట్టి వాటిని వైరల్ చేస్తున్నారు.
ఓటర్‌కు దగ్గరయ్యేందుకు..
పటాన్‌చెరుకు చెందిన ఓ మాజీ సర్పంచ్ కుమారుడు రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. కార్పొరేటర్ కావాలనేది ఆయన కల. ఆయన ప్రత్యేకంగా మట్టి వినాయకులను ఇళ్ల వద్దకే పంపించారు. వైరెటీగా ఆయన ప్రచారానికి పర్యావరణ పరిరక్షణ ట్యాగ్ పెట్టి ప్రజల్లో మట్టి వినాయకులపై అవగాహన కల్పించేలా కలరింగ్ ఇచ్చారు. చేసేది మంచి పనే కావడంతో ప్రజలు బాగా స్పందించారు.
అమీన్‌పూర్‌లో బీజేపీ నేత ఒకరు హిందూ బంధువులకు వినాయకులను అందిస్తానంటూ ప్రత్యేకంగా ఓ శిబిరాన్ని నిర్వహించి గణేశుడి ప్రతిమలు పంపిణీ చేశారు. అమీన్‌పూర్‌కు చెందిన ఓ బీజేపీ నేత తన నియోజకవర్గంలోని ప్రతి ప్రధాన కూడలిలో వినాయక పండుగ శభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పటాన్‌చెరు పట్టణంలో మండల ఆఫీసు ముందు, బస్టాండ్ ఎదరుగా అన్ని ఫ్లెక్సీలే. దాదాపు అందరూ కొత్త ముఖాలే. ఇక అమీన్‌పూర్‌లో మాజీ కౌన్సిలర్లు, యువ నాయకులు మండపాలను సందర్శిస్తూ హడావిడి చేస్తున్నారు. అన్నదానాలకు, మండప నిర్వహణకు ఆర్థిక సాయం చేస్తూ ఆ నేతలు ఆయా కాలనీ సంఘాల వారిని మచ్చిక చేసుకుంటున్నారు.
రామచంద్రాపురంలో ఓ మాజీ జడ్పీటీసీ కుమారుడు, అమీన్‌పూర్‌లో ఓ టీఆర్‌ఎస్ యువ నాయకుడు ప్రజలకు దగ్గరయ్యేందుకు ఉత్సవ కమిటీలకు సాయం చేస్తూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా పటాన్‌చెరు బడా నేతలకు జిల్లా వ్యాప్తంగా వినాయక ఉత్సవ కమిటీలకు ఉదారంగా విరాళాలు ఇచ్చే ఆనవాయితీ ఈ ఏడాది కూడా కొనసాగింది.
లీడర్‌గా ఎదిగేందుకు మండపాలే వేదికలు
అనుకూలంగా మలుచుకుంటున్న
యువ నేతలు
కొత్త ఓటర్లకు దగరయ్యేందుకు
వైరెటీ ప్రచారం