
జల దిగ్బంధంలో సదాశివనగర్
● ఇబ్బందులు పడుతున్న తండావాసులు
● ఇతర ప్రాంతాలతో సంబంధాలు కట్
● అత్యవసరమైతే అటవీ ద్వారా కాలినడకే దిక్కు
రామాయంపేట(మెదక్): మండలంలోని సదాశివనగర్ తండా జలదిగ్బంధంలో చిక్కుకుంది. మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో తండాకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. రెండు వైపులా ఉన్న దారిలో ఐదు చోట్ల రోడ్డు తెగిపోగా, మధ్యలో ఉన్న చెరువు అలుగు పారుతుండటంతో తండావాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాలు ఇలా.. జాన్సిలింగాపూర్ పంచాయతీ పరిధిలో ఉన్న సదాశివనగర్ తండాలో 25 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. మొత్తం జనాభా 180కి ఉంది. ఈ తండాకు ఝాన్సిలింగాపూర్, అక్కన్నపేట ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి అటవీ ప్రాంతం గుండా వేర్వేరుగా రెండు దారులున్నాయి. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి తండాకు నాలుగైదు రోజులపాటు రాకపోకలు స్తంభిస్తాయి. దీంతో ప్రతి ఏటా గిరిజనులకు కాలినడకే శరణ్యంగా మారింది. తాజాగా కురిసిన భారీ వర్షంతో ఎక్కడిక్కడ రోడ్లు తెగిపోయాయి. ఈసారి వరద తీవ్రత అధికంగా ఉండటంతో అక్కన్నపేట వైపు మూడు చోట్ల, ఝాన్సిలింగాపూర్ వైపు రెండు చోట్ల రోడ్డు తెగిపోయింది. తండా సమీపంలో ఉన్న చెరువు అలుగు పారుతుండటంతో వెళ్లడానికి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో గిరిజనులు చెరువు నీటిలోనుంచి, అటవీప్రాంతం గుండా కాలినడకన వస్తున్నారు. తండా రహదారి మరమ్మతు గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని గిరిజనులు వాపోయారు. వెంటనే రోడ్డుకు మరమ్మతులు విజ్ఞప్తి చేశారు. నీటి పారుదలశాఖ ఏఈ సూర్యకాంత్ చెరువు అలుగును, రోడ్డును పరిశీలించారు.

జల దిగ్బంధంలో సదాశివనగర్