సామాజిక సేవలో.. మహిళామణులు | - | Sakshi
Sakshi News home page

సామాజిక సేవలో.. మహిళామణులు

Aug 6 2025 8:21 AM | Updated on Aug 6 2025 8:27 AM

సామాజ

సామాజిక సేవలో.. మహిళామణులు

సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళలు తమ శక్తిని చాటుతున్నారు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అంటూ ఊరంతా సంబరాలు చేస్తూ తల్లీపిల్లను సన్మానిస్తున్నారు. మద్యపాన నిషేధం, బాల్యవివాహ వ్యవస్థ నిర్మూలన, సంపూర్ణ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడమే కాకుండా మొక్కల సంరక్షణ, శ్రమదానం లాంటి సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. అందరి మన్ననలు పొందుతున్న హత్నూర మండలం నస్తీపూర్‌ వెలుగు మహిళా గ్రామైక్య సంఘం 25 ఏళ్ల ప్రస్థానంపై సాక్షి ప్రత్యేక కథనం.

– హత్నూర( సంగారెడ్డి):

ఆదర్శంగా నస్తీపూర్‌ వెలుగు మహిళా గ్రామైక్య సంఘం

ఆడపిల్ల పుడితే ఊరంతా పండుగే..

మద్యపాన నిషేధం,

బాల్యవివాహాలపై అవగాహన

స్వచ్ఛత, మొక్కల సంరక్షణకు కృషి

ఆదర్శ సంఘంగా అవార్డు స్వీకరణ

ఆదర్శ సంఘంగా అవార్డు

నస్తీపూర్‌లో 1999లో స్థానిక సామాజిక సేవ కార్యకర్త రాగిబోగుడా వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆరు గ్రూపులతో వెలుగు మహిళా గ్రామైక్య సంఘాన్ని ప్రారంభించారు. ఈ సంఘం 25 ఏళ్లు పూర్తి చేసుకుని ఆదర్శంగా నిలిచింది. ప్రారంభంలో ఒక్కో సభ్యురాలు నెలకు రూ.30 జమ చేసేది. ప్రస్తుతం గ్రామంలో 19 మహిళా సంఘాలున్నాయి. ఇందులో 204 మంది సభ్యులుండగా.. ప్రస్తుతం ప్రతినెలకు రూ.500 జమ చేస్తున్నారు. ప్రతినెల 12న సమావేశం నిర్వహిస్తారు. ఎవరైనా ఆలస్యంగా వస్తే జరిమానగా రూ.100 చెల్లించాలని నిబంధన పెట్టుకున్నారు. గ్రామంలోని సామాజిక సేవ కార్యకర్త వెంకట్‌ రెడ్డి 121 గజాల సొంత స్థలాన్ని మహిళా సంఘానికి ఉచితంగా ఇచ్చారు. దీంతో 2004లో సంఘ భవనం నిర్మించి జిల్లాకే ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం 20 లక్షల వరకు లావాదేవీలను గ్రామైక్య సంఘం సభ్యులు నిర్వహిస్తున్నారు.

సేవా కార్యక్రమాలు

వరద బాధితుల కోసం గ్రామంలో బియ్యం సమకూర్చి ప్రభుత్వానికి పంపించారు. 2004లో ప్రతి సభ్యురాలికి బ్యాంకు ఖాతా తెరిపించారు. గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం, బాల్య వివాహాలు, వరకట్న దురాచారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 2023 డిసెంబర్‌ నుంచి గ్రామంలో ఆడపిల్ల పుట్టిన ప్రతి తల్లి, పిల్లను సంఘం ఆధ్వర్యంలో సన్మానిస్తున్నారు. సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఇప్పటివరకు సుమారు 25 మంది ఆడపిల్లల పేరుపై బ్యాంకు ఖాతా తెరిచి సంఘం సభ్యుల సొంత డబ్బులు రూ. వెయ్యి జమ చేశారు. రెండో నెల నుంచి ఆడపిల్ల బ్యాంకు ఖాతాలో కుటుంబ సభ్యులు రూ.వెయ్యి జమ చేయాలని, ఈ డబ్బు పాప పెళ్లికి ఉపయోగపడుతుందని అవగాహన కల్పిస్తున్నారు.

సమష్టి కృషితో..

భ్యుల సమష్టి కృషితోనే జిల్లాలోనే ఆదర్శం సంఘంగా గుర్తింపు వచ్చింది. ఆడపిల్ల పుడితే నిరుత్సాహ పడకుండా మనోధైర్యాన్ని నింపి తల్లీపిల్లను సన్మానిస్తున్నాం. పండుగ వాతావరణంలో భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. బ్యాంకు ఖాతా తెరిచి పాప పేరుపై సుకన్య సమృద్ధి యోజన పథకం కింద రూ.వెయ్యి మొదటి నెల చెల్లిస్తున్నాం.

– గొడుగు స్వప్న, అధ్యక్షురాలు, గ్రామైక్య సంఘం

సంతోషంగా ఉంది

సామాజిక సేవా కార్యక్రమాలతోపాటు సంఘం లావాదేవీలు క్రమం తప్పకుండా చూడటం సంతోషంగా ఉంది. ఈ గ్రామ సీసీగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. జిల్లా స్థాయిలో గతంలో అవార్డు కూడా అందుకున్నాం. మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు.

– కల్పన, ఐకేపీ సీసీ

సంఘం ఆధ్వర్యంలో.. కుటుంబ సమస్యల పరిష్కారం, పండుగల నిర్వహణ, గ్రామం నుంచి విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యాన్ని సైతం కల్పించారు. గ్రామంలో ప్రతినెల వైద్య పరీక్షలు చేయించడమే కాక 60 ఏళ్లు నిండిన సభ్యురాలిని సన్మానిస్తున్నారు. గ్రామం ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. గతంలో జిల్లా స్థాయిలో నస్తీపూర్‌ ఆదర్శ వెలుగు సంఘంగా అవార్డు అందుకుంది. సీఎస్‌ఆర్‌ కింద రూ.10 లక్షల నిధులు మంజూరు కావడంతో ప్రస్తుతం నస్తీపూర్‌లో వెలు గు మహిళా సంఘం భవనం నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

సామాజిక సేవలో.. మహిళామణులు1
1/3

సామాజిక సేవలో.. మహిళామణులు

సామాజిక సేవలో.. మహిళామణులు2
2/3

సామాజిక సేవలో.. మహిళామణులు

సామాజిక సేవలో.. మహిళామణులు3
3/3

సామాజిక సేవలో.. మహిళామణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement