
‘ఉపాధి’కి కొత్త హాజరు షురూ
రెండు పూటలా కూలీల ఫొటోలు
● ఒక ఫొటో అప్‌లోడ్ చేస్తే సగం కూలి మాత్రమే ● కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
సంగారెడ్డి జోన్: ఉపాధి హామీ పథకం హాజరులో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఇకనుంచి ఉపాధి హామీలు పనిచేసే కూలీలను ఉదయం, మధ్యాహ్నం ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాలని పేర్కొంది. ఈ విధంగా రెండుపూటలా కూలీల ఫొటోలు అప్‌లోడ్ చేస్తేనే పనిచేసిన వ్యక్తికి పూర్తిగా కూలి డబ్బులు అందనున్నాయి.
ఎన్‌ఎంఎంఎస్ యాప్ ద్వారా ఫొటోలు
ఉపాధి హామీ పథకంలో హాజరు విధానాన్ని ఆన్‌లైన్ ద్వారా చేపట్టింది. కేంద్రం తీసుకొచ్చిన ఎన్‌ఎంఎంఎస్ (నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం) యాప్ ద్వారా ప్రతీరోజు కూలీల ఫేస్ రికగ్నేషన్ చేసి హాజరు తీసుకుంటున్నారు. అయితే పనికి ఆలస్యంగా వచ్చిన కూలీలు కూడా ముందు వచ్చిన కూలీలతో సమానంగా కూలి తీసుకుంటూ ఈ హాజరు విధానాన్ని దుర్వినియోగపరుస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ దృష్టికి వెళ్లింది. దీంతో ఇటువంటి పనులను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ఉపాధి హామీలో కొత్తగా ప్రవేశపెట్టిన హాజరు విధానాన్ని గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి నుంచి రాష్ట్రస్థాయిలో కమిషనర్ వరకు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. తీసిన ఫొటోలను మండలస్థాయిలో అధికారుల ఆదేశాల మేరకు ఫొటోలను డీఆర్‌డీఏకు కలెక్టర్‌కు పంపించాల్సి ఉంటుంది.
హార్డ్‌డిస్క్ కొనుగోలుకు ఆదేశాలు
కూలీల హాజరు కోసం తీసే ఫొటోలు విధిగా భద్రపరిచేందుకు హార్డ్‌డిస్క్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ ఏటా చేపట్టే సోషల్ ఆడిట్ పూర్తయ్యేంతవరకు ఆ ఫొటోలను ఆ డిస్క్‌లో నిక్షిప్తం చేసి ఉంచాలి.
వ్యతిరేకిస్తున్న కూలీలు సిబ్బంది
ఉపాధి హామీ హాజరుకు సంబంధించి కూలీలను రెండు పూటలా ఫొటోలు తీయాలన్న నిబంధనను అటు కూలీలతోపాటు ఉపాధి హామీ సిబ్బంది కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ కొత్త హాజరు విధానం వల్ల ఉపాధి పనులకు హాజరయ్యే వారి శాతం తగ్గిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు.