కూలీకి ధీమా.. ఉపాధి బీమా | - | Sakshi
Sakshi News home page

కూలీకి ధీమా.. ఉపాధి బీమా

Jul 15 2025 12:31 PM | Updated on Jul 15 2025 12:31 PM

కూలీకి ధీమా.. ఉపాధి బీమా

కూలీకి ధీమా.. ఉపాధి బీమా

రూ. 2 లక్షల వరకు కవర్‌
● ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ● సంవత్సరానికి రూ. 20 చెల్లింపు

సంగారెడ్డి జోన్‌: గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించి స్థానికంగా పనులు కల్పించేందుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. జాబ్‌ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి 100 రోజులపాటు పనులు కల్పిస్తోంది. ఉపాధి పనులు కల్పించడంతో పాటు పని చేసే సమయంలో ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఆదుకునేందుకు బీమా సౌకర్యం సైతం కల్పిస్తుంది. దీంతో ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు మరింత ధీమా పెరుగుతుంది.

పీఎంఎస్‌బీవై ద్వారా అమలు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉపాధి హామీ కూలీలకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా బీమా సౌకర్యం కల్పిస్తుంది. ఈ పథకంలో ఉపాధి హామీ కూలీగా ఉండి 18 నుంచి 70 సంవత్సరాల లోపు ఉన్నవారు అర్హులుగా నిర్ణయించారు. కూలీ సంబంధిత జాతీయ బ్యాంకుతో బీమా చేయించుకునేందుకు అంగీకారం కుదుర్చుకొని ప్రతి సంవత్సరం రూ. 20 ప్రీమియం చెల్లించాలి.

గాయాలైతే లక్ష.. మృతి చెందితే రూ.2 లక్షలు

ఉపాధి హామీలో పని చేసే కూలీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. ఉపాధి హామీ పనులు చేసే సమయంలో నిత్యం ఏదో చోట ఏదో ఘటన జరుగుతోంది. గాయాల పాలవడంతో పాటు మృత్యువాత పడిన సందర్భాలు సైతం ఉన్నాయి. బీమా ప్రీమియం చెల్లించిన వారికి ప్రమాదవశాత్తు గాయాలై పనిచేయని స్థితిలో ఉన్న వారికి రూ.లక్ష, మృత్యువాత పడితే రూ.2లక్షల బీమా వర్తిస్తుంది.

ఉపాధి పనులపై ఆసక్తి

గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఉపాధి హామీని మహిళలే అత్యధికంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా వేసవిలో ఇతర పనులు లేకపోవడంతో ఉపాధి పనులకు డిమాండ్‌ పెరుగుతుంది. రైతు సంక్షేమం కోసం చేపట్టే పనులతోపాటు ఇతర అభివృద్ధి పనులు చేపపడుతున్నారు. ప్రతి సంవత్స రం ప్రభుత్వాలు కూలీ రేటును పెంచుతున్నాయి. ప్రస్తుతం ఒకరోజు రూ. 307గా నిర్ణయించారు.

జిల్లాలో ఉపాధి హామీ పనుల వివరాలు

గ్రామ పంచాయతీలు 619

జిల్లాలో ఉన్న

మొత్తం జాబ్‌ కార్డులు 2.19 లక్షలు

యాక్టీవ్‌గా ఉన్న జాబ్‌కార్డులు 1.32 లక్షలు

ఉపాధి హామీ కూలీలు 4.03 లక్షలు

నాలుగు లక్షల మందికి లబ్ధి

జిల్లాలోని 619 గ్రామపంచాయతీల్లో ఉపాధి హామీ పథకం కొనసాగుతుంది. ఆయా గ్రామాల్లో రెండు లక్షల 19 జాబ్‌ కార్డులు ఉండగా.. ఒక లక్ష 32 వేల కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయి. అందులో సుమారు నాలుగు లక్షలకు పైగా ఉపాధి హామీ కూలీలు నమోదై ఉన్నారు. దీంతో సుమారు 4 లక్షల 3వేల మందికి లబ్ధి చేకూరనుంది. కూలీలకు లబ్ధి పొందాలంటే ప్రవేశపెట్టే పథకంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా ఉపాధిలో 18 నుంచి 70 సంవత్సరాలు లోపు ఉన్న కూలీల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement