
మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో..
● యువకుడి దారుణ హత్య ● పోలీసులకు లొంగిపోయిన నిందితులు ● జహీరాబాద్‌లో ఘటన
జహీరాబాద్ టౌన్: మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. సోమవారం డీఎస్పీ సైదా నాయక్, టౌన్ సీఐ శివలింగంతో కలసి ఈ కేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని బసవేశ్వర మోహల్లాకు చెందిన తాజోద్దీన్ (22) మహీంద్ర ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి మంత్రాలు వస్తాయని, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో మంత్రాలతో తమ కుటుంబ సభ్యులను అనారోగ్యానికి గురి చేస్తున్నాడని మాణిక్‌ప్రభు వీధికి చెందిన ఎండీ హసన్ ఖురేషికి అనుమానం కలిగింది. ఇదే విషయమై పలు మార్లు ఖురేషి, తాజోద్దీన్‌ను హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం దెబ్బతీస్తున్నాడనే అనుమానంతో ఎలాగైన తాజోద్దీన్‌ను హత్య చేయాలని ఖరేషి నిర్ణయించుకున్నాడు. ఆదివారం ఉదయం 11.30 ప్రాంతంలో తాజోద్దీన్ నాగులకట్ట ప్రాంతానికి వెళ్లడాన్ని ఖురేషి చూశాడు. దీంతో తన మిత్రుడు ముఖ్రంతో కలసి బైక్‌పై ఆ ప్రాంతానికి వెళ్లాడు. ఒక విషయం మాట్లాడాలని చెప్పి.. తాజోద్దీన్‌ను బైక్‌పై ఎక్కించుకుని చెన్నారెడ్డి నగర్ కాలనీ వద్ద గల చెరకు తోట లోపలికి తీసుకెళ్లారు. అక్కడ తాజోద్దీన్ చేతులు కట్టేసి ఇద్దరూ కలిసి తీవ్రంగా కొట్టారు. అనంతరం హసన్ ఖురేషి వెంట తెచ్చుకున్న కత్తితో తాజోద్దీన్ మెడపై నరకడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహాన్ని అక్బర్ అనే వ్యక్తికి చెందిన కారులో తీసుకెళ్లి ఓ బావిలో పడేశారు. అనంతరం ముగ్గురూ పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు తాజోద్దీన్ మృతదేహాన్ని గుర్తించి, నిందితుల నుంచి కారు, మూడు బైక్‌లు, కత్తితో పాటు 3 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.