
తప్పిపోయిన పాప.. క్షేమంగా అప్పగింత
సిద్దిపేటకమాన్: తప్పిపోయిన పాపను పోలీసులు వివరాలు తెలుసుకుని వారి బంధువులకు అప్పగించారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఉపేందర్ వివరాల ప్రకారం.. పట్టణంలోని శంకర్‌నగర్‌లో ఆరె అర్జున్ తన భార్య, కూతురు దివ్య(4)తో కలిసి నివాసం ఉంటున్నాడు. అర్జున్ పాత బట్టలు విక్రయిస్తుంటాడు. సోమవారం తండ్రి పాత బట్టలు విక్రయించడానికి వేములవాడకు వెళ్లడంతో పాప ఇంటి వద్దే ఉంది. ఈ క్రమంలో పాప ఆడుకుంటూ ఇంటి నుంచి బయటకు వచ్చి స్థానిక బాలాజీ థియేటర్ సమీపంలో ఏడుస్తూ ఉండగా.. గమనించిన ఓ వ్యక్తి టూటౌన్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించాడు. సీఐ ఉపేందర్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా పాప ఏడుస్తూ తన పేరు దివ్య అని మాత్రమే చెప్పింది. దీంతో సీఐ తమ సిబ్బంది ద్వారా పాప ఫొటోను అన్ని వాట్సప్ గ్రూప్‌ల ద్వారా వైరల్ చేశారు. పాపను గుర్తించిన అంగన్‌వాడీ టీచర్ పీఎస్‌కు వచ్చింది. దీంతో వివరాలు తెలుసుకుని పాప పెద్దనాన్న కూడా అక్కడికి రావడంతో పోలీసులు వారికి అప్పగించారు.