
సమస్యల పరిష్కారానికి చర్యలు
● కలెక్టర్ ప్రావీణ్య
● ప్రజావాణిలో వినతుల స్వీకరణ
సంగారెడ్డి జోన్: ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ మేరకు 73 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని బాధితులు తమ గోడు వెల్లబోసుకున్నారు. సమస్యలతో ప్రభుత్వాలు అందించే పలు పథకాలు లబ్ధిపొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యం మేరకు రుణాలు అందించాలి
సంగారెడ్డి జోన్: మున్సిపాలిటీలో మెప్మా, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమన్వయం చేసి కార్మికులకు లక్ష్యం మేరకు రుణాలను అందించాలని కలెక్టరు ప్రావీణ్య సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత స్వయం ఉపాధి కోసం ఉద్దేశించిన కార్యక్రమంపై సంగారెడ్డి మున్సిపాలిటీలో అవగాహన కల్పించాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడానికి ఫిట్టింగ్, ప్లాంటేషన్ వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. ప్రత్యేక అధికారులు విధిగా వసతి గృహాలను తనిఖీ చేయాలన్నారు.
కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి
మొగుడంపల్లి మండల పరిధిలోని ధనసిరిలో తమ స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. అధికారులు పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకొని ఇంటి నిర్మాణం జరిగే విధంగా చూడాలి.
– శివకుమార్, ధనసిరి,
మొగుడంపల్లి
తెలియకుండానే పట్టా చేశారు
కోహిర్ మండల పరిధిలోని దిగ్వాల్ గ్రామ శివారులో 5 ఎకరాల భూమి కొనుగోలు చేసి నా పేరున పట్టా చేసుకున్నా. గతేడాది డిసెంబర్‌లో కోర్టు నుంచి ఇతరుల పేరుపై భూమి మారిందని, స్థలం ఖాళీ చేయాలని అందించారు. సంబంధిత కార్యాలయంలో విచారణ చేయగా ఇతరుల పేరుపైకి భూమి మారిందంటూ నిర్లక్ష్యంగా అధికారులు సమాధానం ఇస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకొని న్యాయం చేయాలి.
– శోభారాణి, శాంతినగర్, హైదరాబాద్

సమస్యల పరిష్కారానికి చర్యలు

సమస్యల పరిష్కారానికి చర్యలు