
జల్సాలకు అలవాటు పడి..
సిద్దిపేటకమాన్: ట్రాన్స్‌ఫార్మర్లను పగలగొట్టి అందులోని కాపర్ వైరును దొంగిలిస్తున్న ముఠాలోని ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసు కమిషనర్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ అనురాధ కేసు వివరాలు వెల్లడించారు. కొండపాక మండల కేంద్రంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను పగులగొట్టి కాపర్ వైర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు మే 27న చోరీ చేసినట్లు విద్యుత్‌శాఖ ఏఈ కుకునూరుపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే జిల్లాలో మరికొన్ని గ్రామాల్లో కూడా ఇదే తరహా ఘటనలు చోటు చేసుకోవడంతో రైతులు విద్యుత్ సమస్యతో పొలాల దగ్గర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో గజ్వేల్ ఏసీపీ నరసింహులు ఆధ్వర్యంలో తొగుట సీఐ లతీఫ్, కుకునూర్‌పల్లి ఎస్‌ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. రాజస్థాన్ రాష్ట్రం భరత్‌పూర్ జిల్లాలోని ఝూనతి గ్రామానికి చెందిన మహమ్మాద్ అజారుద్దీన్ (27), మహమ్మద్ షాకీర్ (28), తెలీమ్‌ఖాన్, సలీమ్ అలియాస్ సోహెల్, అక్రమ్ సిద్దిపేట జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో జేసీబీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వీరు జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఐదుగురు ముఠాగా ఏర్పడ్డారు. పగలు రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో ఇద్దరు నిందితులు ద్విచక్ర వాహనంపై వచ్చి ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి అందులోని కాపర్ వైర్‌ను దొంగిలిస్తున్నారు. వీరికి మరో ముగ్గురు నిందితులు సహకరించే వారు. దొంగిలించిన కాపర్ వైర్‌ను హర్యానా, ఇతర ప్రాంతాల్లో స్క్రాప్ షాప్‌లలో విక్రయిస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు.
185 కేసుల్లో నిందితులు..
కొన్ని నెలలుగా సిద్దిపేట జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో మొత్తం 185 ట్రాన్స్‌ఫార్మర్లు పగలగొట్టి కాపర్ వైర్ చోరీ చేసినట్లు పలు పోలీసు స్టేషన్‌లలో నిందితులపై 185 కేసులు నమోదయ్యాయి. నాలుగు నెలలుగా సిద్దిపేట జిల్లాలో 26, మెదక్‌లో 34, కరీంనగర్ జిల్లాలో 19, వరంగల్ జిల్లాలో 63, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 40, సైబరాబాద్ పరిధిలో 2, పెద్దపల్లి జిల్లాలో ఒక ట్రాన్స్‌ఫార్మర్ పగులగొట్టి కాపర్ వైరును తస్కరించారు. అజారుద్దీన్ 49 కేసుల్లో నిందితుడిగా ఉండటంతో పాటు షామీర్‌పేట పీఎస్ పరిధిలో జరిగిన ఓ కేసులో రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. టెక్నాలజీ సాయంతో నిందితులను గుర్తించి వారిలో మహమ్మాద్ అజారుద్దీన్, మహమ్మాద్ షాకీర్‌లను రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 272 కేజీల కాపర్ వైర్, రూ.3,24,700 నగదుతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. పరారీలో ఉన్న ముగ్గురిని త్వరలో పట్టుకుంటామన్నారు. టెక్నాలజీ సాయంతో నిందితులను అరెస్టు చేయడంలో కీలకపాత్ర వహించిన సీఐ లతీఫ్, ఎస్‌ఐ శ్రీనివాస్, బేగంపేట ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు మధుసూధన్‌రెడ్డి, రమణ, ఐటీ కోర్ సిబ్బంది శ్రీకాంత్, రమేష్, కానిస్టేబుల్స్‌ను అభినందించి, నగదు రివార్డు అందజేశారు.