
వరకట్న వేధింపులతో గర్భిణి ఆత్మహత్య
టేక్మాల్ (మెదక్): వరకట్నం వేధింపులతో నిండు గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండలంలోని హసన్‌మహమ్మద్ పల్లి గ్రామంలో గురువారం వెలుగుచూసింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎక్కెల సాయిలు మూడో కూతురు మానస (17)ను పెద్దశంకరంపేట మండలంలోని మూసాపేట గ్రామానికి చెందిన తెరిగోర సంగమేశ్వర్‌తో 2024 ఏప్రిల్ 19న వివాహం చేశారు. కాగా, రెండేళ్ల క్రితం సంగమేశ్వర్‌ను హసన్ మహమ్మద్‌పల్లి గ్రామానికి చెందిన ఎక్కాల పోచమ్మ, బీరయ్య తన ఇంటికి దత్తత తీసుకున్నారు. వివాహ సమయంలో తులం బంగారంతో పాటు బైకు కోసం లక్ష రూపాయలు ఇచ్చారు. ఇంకా ఐదు తులాల బంగారం ఇవ్వాల్సి ఉండగా ఈ ఏడాది ఖరీఫ్ పంటలపై ఇస్తానని మానస తల్లిదండ్రులు చెప్పారు. ఈ బంగారం కోసం తరచూ సంగమేశ్వర్ భార్యను వేధిస్తుండగా పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీ పెట్టారు. మానస 8 నెలల గర్భిణి కావడంతో తమ ఇంటికి తీసుకెళ్తామని ఈ నెల 7న మానస తల్లి బేతమ్మ వెళ్లి అడగగా పంపించనని గొడవపడ్డాడు. బుధవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులంతా వ్యవసాయ పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చే సరికి తలుపులు మూసి ఉన్నాయి. ఇంటి పైకప్పు తెరిచి లోపలికి చూడగా మానస దూలానికి చీరతో ఉరివేసుకొని మృతి చెందింది. తన కూతురు అల్లుడు వేధింపులతోనే ఉరివేసుకున్నదని తండ్రి సాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటన స్థలాన్ని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు.
ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ