
ఆయిల్‌పామ్ సాగుకు రాయితీ
రైతులతో కలెక్టర్ ప్రావీణ్య
జహీరాబాద్: పంట మార్పిడిని ప్రోత్సహిస్తూ మూడు రెట్లు అధిక దిగుబడి కలిగించే బహు వార్షిక వాణిజ్య పంట అయిన ఆయిల్‌పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం 90% రాయితీని కల్పిస్తోందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య స్పష్టం చేశారు. మండలంలోని గోవింద్‌పూర్ గ్రామంలోని రైతు నాగిశెట్టి రాథోడ్ వ్యవసాయ పొలంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య పాల్గొని మొక్కలు నాటారు. అంతకుముందు మండలంలోని హోతి(కె) గ్రామ శివారులోని కస్తూర్బా గాంధీ(కేజీబీవీ) మైనార్టీ బాలికల పాఠశాలను సందర్శించి క్లాస్ రూమ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీతో పాటు మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను అందిస్తోందన్నారు. మొదటి నాలుగేళ్ల పాటు అంతర పంటల సాగుకు ఎకరానికి రూ.4,200 ప్రోత్సహకం కింద అందిస్తుందన్నారు. ఈ ఏడాది జిల్లాలో ఆయిల్‌పామ్ సాగును 3,750 ఎకరాలు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. ఇప్పటికే జూన్ నెలలో 200 ఎకరాల్లో మొక్కలు నాటడం పూర్తయిందని తెలిపారు. అంతకుముందు క్లాస్ రూమ్‌లను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందరికీ అందాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు నూతన శైలి బోధనా పద్ధతులు పాంటించాలని సూచించారు. ముఖ్యంగా గణిత శాస్త్రం, సైన్స్, ఇంగ్లీష్ వంటి సబ్జెక్టుల్లో పిల్లలకు ఆత్మవిశ్వాసం పెంపొందించేలా బోధన జరగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ రామ్‌రెడ్డి, తహసీల్దార్ దశరథ్, ఉద్యాన శాఖ జిల్లా అధికారి సోమేశ్వరరావు, మండల అధికారి పండరీ, గోద్రేజ్ సంస్థ ప్రతినిధులు కొండలరావు, వెంకటేశ్వర్లు, డ్రిప్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆయిల్‌పామ్ సాగుకు రాయితీ