
రైతు వేదికల్లో సాగు చైతన్యం
● రైతులకు సలహాలు,సూచనలిస్తున్న ఏఈఓలు ● జిల్లాలో 116 రైతు వేదికలు ● 28 మంది ఏఓలు ● 116 మంది ఏఈఓలు
మునిపల్లి(అందోల్): ప్రభుత్వం ఏర్పాటుచేసిన రైతు వేదికలు అన్నదాతకు అండగా నిలబడుతున్నాయి. రైతు వేదికల ద్వారా రైతులకు పలు రకాల ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ఏఈఓల ద్వారా వివిధ రకాల పంటల సాగులో అన్నదాతలను ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తూ సలహాలు, సూచనలిస్తూ మంచి దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అలాగే రైతులందరినీ ఒకే చోట చేర్చి వారికి పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు ఈ రైతు వేదికలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. జిల్లాలో 28 మండలాల్లో మొత్తం 116 రైతు వేదికలున్నాయి. 28 మంది మండల (ఏఓలు) వ్యవసాయాధికారులతోపాటు 116 మంది వ్యవసాయ విస్తీర్ణాధికారులు (ఏఈఓలు)లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
రైతు వేదికలతో ఇవీ ప్రయోజనాలు...
జిల్లాలో నిర్మించిన రైతు వేదికలతో రైతులకు పలు రకాల ప్రయోజనాలు కలుగుతున్నాయి.
● ప్రతి క్లస్టర్ పరిధిలోని రైతు వేదికలో ఏఈఓలు రైతులకు అందుబాటులో ఉంటూ సలహాలు, సూచనలిస్తున్నారు.
● రైతు వేదికల్లో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి పంట సాగుపై అవగాహన కల్పిస్తున్నారు.
● పంటలకు తెగుళ్లు సోకినప్పుడు క్లస్టర్ పరిధిలోని ఏఈఓలు పంటలను నేరుగా సందర్శించి వాటి నివారణకు సూచనలు చేస్తున్నారు.
● రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై అవగాహన కల్పిస్తున్నారు.
● పంటలకు తెగుళ్లు సోకినప్పుడు గతంలో రైతులు ఇష్టం వచ్చిన మందులు పిచికారీ చేసేవారు. దీంతో తెగుళ్లు తగ్గకపోగా రైతులు ఆర్థికంగా నష్టపోయేవారు. కానీ, రైతు వేదికలు వచ్చిన తర్వాత పంటలకు ఏ తెగులు సోకింది? దాని నివారణకు ఏ మందులు వాడాలో ఏఓలు, ఏఈఓలు చెబుతున్నారు.