
కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోరేం?
రామచంద్రాపురం(పటాన్‌చెరు): ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు చేసుకుని అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా తమను పట్టించుకోవడం లేదని తెల్లాపూర్ మున్సిపల్ వాసులు ఆవేదన చెందుతున్నారు. మున్సిపల్ పరిధిలో రెండు నెలల క్రితం వందలాది మంది ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎల్‌ఆర్‌ఎస్ రుసుమును కూడా చెల్లించేశారు. అయితే అధికారులు తమను మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటూ పని మాత్రం చేయడం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. తమ దరఖాస్తు విషయాన్ని ఏమైందని అడిగితే అస్సలు సమాధానం చెప్పకపోగా తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. కొందరికి మాత్రం అధికారులు ఆగమేఘాలపై పనిపూర్తి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. మరి కొంతమంది ఇప్పటివరకు అధికారులు చేసిన ఎల్‌ఆర్‌ఎస్‌లపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పలువురు ఎల్‌ఆర్‌ఎస్
దరఖాస్తుదారుల ఆవేదన
నా దృష్టికి రాలేదు
మున్సిపల్ కార్యాలయంకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాం. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్న విషయం ఎవరు నాదృష్టికి తీసుకురాలేదు. ఇక ముందు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటాం.
– అజయ్ కుమార్ రెడ్డి,
మున్సిపల్ కమిషనర్, తెల్లాపూర్